|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:20 PM
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు రెండేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత.. ఈ కేసులో జైలుపాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాలను నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు వారిపై మోపిన ఆరోపణలను కొట్టివేస్తూ తాజాగా తీర్పు చెప్పింది. తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తనను అక్రమంగా ఇంటి నుంచి తీసుకెళ్లి జైల్లో పెట్టిన రోజులను గుర్తు చేసుకుంటూ, చివరకు సత్యమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమపై బురద జల్లారని ఆరోపించారు.ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మరియు మనీశ్ సిసోడియా మధ్య ఎలాంటి కుట్ర జరగలేదని, సీబీఐ సమర్పించిన సాక్ష్యాల్లో పస లేదని కోర్టు తేల్చిచెప్పింది. "కేవలం అనుమానాలతో తీవ్రమైన ఆరోపణలు చేయలేరు.. ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని దోషిగా నిలబెట్టడం సరైంది కాదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ను నిర్దోషిగా ప్రకటించడంతో, ఆయనపై ఉన్న అన్ని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
Latest News