|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 08:35 PM
కేరళ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి సంప్రదాయ ప్రత్యర్థులైన ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లతో పాటు ఎన్డీయే కూడా గట్టిగా పోటీకి సిద్ధమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మూడు కూటముల మధ్య పోటీలో ఎవరు ఆధిక్యం సాధిస్తారు? ఓటర్ల మొగ్గు ఎటువైపు? అన్న చర్చ జోరందుకుంది.ఈ నేపథ్యంలో ‘లోక్ పోల్’ సంస్థ తాజాగా నిర్వహించిన ప్రీ-పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇప్పుడే ఎన్నికలు జరిగితే అధికార ఎల్‌డీఎఫ్‌కు ప్రతికూల వాతావరణం ఉందని, విపక్ష యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని సర్వే సూచించింది. ఎన్డీయే ప్రభావం మాత్రం పరిమితంగానే ఉంటుందని అంచనా వేసింది.మొత్తం 140 స్థానాలున్న అసెంబ్లీలో యూడీఎఫ్‌కు 81 నుంచి 86 సీట్లు వచ్చే అవకాశముందని సర్వే పేర్కొంది. ఎల్‌డీఎఫ్ 51 నుంచి 59 స్థానాలకు పరిమితం కావచ్చని, ఎన్డీయేకు గరిష్ఠంగా 2 సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. ఓట్ల శాతంలో యూడీఎఫ్‌కు 43–45%, ఎల్‌డీఎఫ్‌కు 39–41%, ఎన్డీయేకు 13–15% మధ్య మద్దతు లభించే అవకాశముందని వెల్లడించింది. ఫిబ్రవరి 9 నుంచి 24 వరకు ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ తెలిపింది.ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర, మధ్య కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉండగా, దక్షిణ కేరళలో ఎల్‌డీఎఫ్ తన పట్టును కొంతవరకు నిలుపుకుంటోందని సర్వే విశ్లేషించింది. శబరిమల వంటి అంశాలు ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. క్రైస్తవ ఓటర్లు అధికంగా యూడీఎఫ్ వైపు ఉండగా, ముస్లిం ఓటర్ల మద్దతు ప్రధానంగా ముస్లిం లీగ్‌కు కొనసాగుతున్నట్లు తెలిపింది. వరి రైతులు, మత్స్యకారులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందని సర్వే పేర్కొంది.
Latest News