|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 10:41 PM
NZ vs ENG మ్యాచ్‌లో సెమీస్‌పై దృష్టి పెట్టిన న్యూజిలాండ్‌కు మంచి ఆరంభం దక్కినా, ఆ జోరును భారీ స్కోర్‌గా మార్చుకోలేకపోయింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి 56 పరుగులు జోడించిన ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (35), ఫిన్ అలెన్ (29) ఔటయ్యాక ఇన్నింగ్స్ గాడి తప్పింది.మిడిలార్డర్‌ను ఇంగ్లండ్ స్పిన్నర్లు బిగుసుకుపట్టారు. ఆదిల్ రషీద్ (2-28), విల్ జాక్స్ (2-23) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ పరుగుల వేగం తగ్గింది. చివర్లో సారథి మిచెల్ శాంట్నర్ (9 నాటౌట్) ఆఖరి బంతిని సిక్సర్‌గా మలచడంతో న్యూజిలాండ్ 7 వికెట్లకు 159 పరుగులు చేసి, ఇంగ్లండ్‌కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.నాకౌట్ దశలో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న ఇంగ్లండ్, ఈ మ్యాచ్‌లోనూ అద్భుత నియంత్రణ ప్రదర్శించింది. 180కు పైగా స్కోర్ చేసే స్థితిలో కనిపించిన కివీస్‌ను స్పిన్ ఉచ్చులో పడేసి 159కే పరిమితం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌కు సీఫర్ట్, అలెన్ జంట వేగవంతమైన ఆరంభం అందించింది. జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, తర్వాత సీఫర్ట్ వరుస బౌండరీలు, సిక్సర్‌తో ఒత్తిడి తిప్పికొట్టాడు.64 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని చెరిపేసేందుకు కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆదిల్ రషీద్‌ను రంగంలోకి దింపగా ఫలితం దక్కింది. భారీ షాట్ ప్రయత్నంలో సీఫర్ట్ స్టంపౌట్ కావడంతో ఆ జోడీ విడిపోయింది. వెంటనే విల్ జాక్స్ బౌలింగ్‌లో అలెన్ ఔటవడంతో కివీస్‌కు వరుస దెబ్బలు తగిలాయి.రచిన్ రవీంద్ర (11), గ్లెన్ ఫిలిప్స్ (39) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు 31 పరుగులు జోడించిన తర్వాత రవీంద్రను రెహాన్ అహ్మద్ పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం మార్క్ చాప్‌మన్ (15)తో కలిసి ఫిలిప్స్ రన్‌రేట్ పెంచే యత్నం చేశాడు. అయితే డ్రింక్స్ బ్రేక్ అనంతరం చాప్‌మన్ స్టంపౌట్ కావడం మరో మలుపు.ఫామ్‌లో లేని డారిల్ మిచెల్ (3)ను లియామ్ డాసన్ ఔట్ చేయడంతో కివీస్ ఒత్తిడిలోకి వెళ్లింది. చివరి ఓవర్లో శాంట్నర్ సిక్సర్‌తో ముగింపు ఇచ్చినా, న్యూజిలాండ్ ఆశించిన స్థాయిలో స్కోర్ చేయలేకపోయింది.
Latest News