|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 11:11 PM
ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న వినోబా నవోదయ కాలనీలో ఇళ్ల కూల్చివేత ఘటనపై National Human Rights Commission (ఎన్‌హెచ్ఆర్‌సీ)లో కేసు నమోదు అయింది.ఈ ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ దర్యాప్తు చేపట్టనున్నట్లు ఫిర్యాదుదారు, అడ్వకేట్ ఇమ్మనేని రామారావు వెల్లడించారు. వెలుగుమట్ల గ్రామ పరిధిలోని భూదాన్ భూములపై గతంలో రాష్ట్ర హైకోర్టు స్టేటస్ క్వో ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. భూదాన్ భూముల అసలు ఉద్దేశం పేదలకు పంపిణీ చేయడమేనని, అక్కడ ఇళ్లు నిర్మించుకున్న వారిపై నిషేధం లేదని పేర్కొన్నారు.సుమారు 600 మంది పేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనలో కలెక్టర్ అనుదీప్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఎస్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఎన్‌హెచ్ఆర్‌సీకి చేసిన ఫిర్యాదులో కోరారు. బాధిత కుటుంబాలకు తలా రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కూడా విజ్ఞప్తి చేశారు.వివాదాస్పద భూముల విలువ పెరిగిన నేపథ్యంలోనే ఈ కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు. అదేవిధంగా, జిల్లా మంత్రికి సన్నిహితులుగా ఉన్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినోబా కాలనీ సమీపంలో వెంచర్‌లు అభివృద్ధి చేస్తున్నారని, ఆ కారణంగానే ఈ చర్యలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Latest News