|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:22 PM
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. రౌస్ అవెన్యూ న్యాయస్థానం తీర్పును ఆయన స్వాగతించిారు. న్యాయవ్యవస్థే అత్యున్నతమైందని, న్యాయస్థానం తీర్పును అంగీకరించాలని అన్నా హజారే వ్యాఖ్యానించారు. అయితే, ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు ఆయన కొన్ని సూచనలు చేశారు. వ్యక్తిగతంగా లేదా పార్టీ గురించి కాకుండా సమాజం, దేశం కోసం పనిచేయాలని కేజ్రీకి సలహా ఇచ్చారు. ఢిల్లీ మద్యం పాలసీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని పేర్కొంటూ నిందితులు 23 మందిని కోర్టు నిర్దోషులని తేల్చింది.
మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేజ్రీవాల్‌పై గతంలో చేసిన విమర్శల గురించి హజారే ప్రస్తావిస్తూ... ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు కోర్టు ఎటువంటి తీర్పు చెప్పలేదని అన్నారు. ఇంత పెద్ద దేశంలో ఎన్నో పార్టీలు, కులాలు, మతాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థ వల్లే ఈ దేశం సరైన దారిలో నడుస్తోందని సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ బలంగా లేకుంటే నేరస్థులే పైచేయి సాధించేవారని ఆయన వ్యాఖ్యానించారు.
మద్యం పాలసీ కేసులో అరవిద్ కేజ్రీవాల్ ఎటువంటి తప్పు చేయలేదని కోర్టు విశ్వసించిందని, ఆ తీర్పును మనం గౌరవించి తీరాల్సిందేనని అన్నా హజారే అన్నారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తన కార్యకర్తలేనని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, అన్నాహజారే జన్‌లోక్ పాల్ ఉద్యమంతోనే కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అన్నాహజారే నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం దేశంలోనే అతిపెద్ద ప్రజాపోరాటం. ఈ ఉద్యమంలో ఆయన వెంట కేజ్రీ నడిచారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన తర్వాత పలు సందర్భాల్లో తన శిష్యుడ్ని టార్గెట్ చేస్తూ హజారే విమర్శలు గుప్పించారు. గతేడాది ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమిపై స్పందింస్తూ.. అధికార దాహంతోనే ఓడిపోయారని హజారే వ్యాఖ్యానించారు. అనేక అవినీతి ఆరోపణలు.. డబ్బు, అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడటం వల్లే ప్రజలు ఓడించారని అన్నారు. ఇక, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆరోపణలను నిరూపించే ఆధారాలు లేవని తేల్చిచెప్పింది.
Latest News