|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:57 PM
ఆసియాలోనే అతి పెద్దైన గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లే రైతులకు యాజమాన్యం తీపికబురు చెప్పింది. అన్నదాతల కోసం ఉచిత భోజనం పథకాన్ని ప్రారంభించారు. మిర్చి యార్డ్ ఛైర్మన్ కుర్రా అప్పారావు, కార్యదర్శి చంద్రిక ఉచిత భోజనాన్ని ప్రారంభించి.. రైతులకు స్వయంగా వడ్డించారు. తెలుగు రాష్ట్రాల నుంచి గుంటూరు మిర్చి యార్డుకు ప్రతి రోజూ వందలాదిమంది రైతులు వస్తుంటారు. వారందరు భోజనం విషయంలో ఇబ్బందిపడకుండా ఈ ఉచిత భోజన సదుపాయం కల్పించారు. భోజనంతో పాటుగా టిఫిన్ కూడా అందిస్తున్నారు. రైతులకు అందించే ఆహారం విషయంలో రాజీపడేది లేదని.. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామంటున్నారు. మిర్చియార్డులో ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నందుకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
గుంటూరు మిర్చియార్డు ఆసియాలోనే పెద్దది.. ప్రతీ ఏటా రూ.10 వేల కోట్లకు పైనే లావాదేవీలు జరుగుతాయని అంచనాలు ఉన్నాయి. భారీ విక్రయాలు జరుగుతున్నాయి.. ఏడాదికి దాదాపు 2 కోట్లు బస్తాలు యార్డుకు వస్తాయ. ఈ మిర్చి యార్డు ద్వారా 30 వేల మంది ఉపాధి పొందుతున్నారనంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. యార్డులో బస్తాలు దించేందుకు, తూకం వేసేందుకు లారీల్లోకి లోడ్‌తో పాటుగా ఆన్‌లోడ్ చేయడం, కోల్డ్ స్టోరేజ్‌కు తరలించడం.. ఇలా స్థానికులు ఎన్నో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. లారీల యజమానులు సరుకు రవాణా, డ్రైవర్లకు ఉపాధి పొందుతారు. యార్డు ఉద్యోగులు, సిబ్బంది, బ్యాంకులు ఇలా ఎంతోమంది ఉన్నారు.
రైతుల కోసం ఉచితంగా భోజనం అందిస్తున్నామని.. ఓ మెనూను తయారు చేశామన్నారు గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ కుర్రా అప్పారావు. భోజనం కూడా నాణ్యతగా ఉండేలా చూస్తున్నామన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందుబాటులో ఉంటుందన్నారు. రైతులకు ఉడికించిన గడ్డు, పెరుగు అందిస్తామన్నారు మిర్చి యార్డు కార్యదర్శి చంద్రిక. రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటూ.. నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఏదైనా తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. మర్చి యార్డులో ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. బయట తినాలంటే కనీసం రూ.100 వరకు ఖర్చవుతుందని.. యార్డులో ఉచితంగా భోజనం అందిస్తే తమకు ఆర్థిక భారం తగ్గుతుందంటున్నారు. యార్డుకు వచ్చి భోజనం కోసం 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి పరిస్థితి ఉండేదన్నారు. ఇక సంతోషంగా యార్డులోనే తింటామన్నారు.
Latest News