ఒత్తిడి వల్ల మలబద్ధకం వస్తే కనిపించే లక్షణాలు
 

by Suryaa Desk | Sat, Feb 28, 2026, 11:02 PM

మలబద్ధకం అనేది ఒక సాధారణ జీర్ణ సమస్య. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత జీవనశైలి కారణంగా మలబద్ధకం చాలా మందిలో కనిపిస్తుంది. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మలబద్ధకం బారిన పడుతున్నారు. అయితే, మలబద్ధకం కేవలం మనం తినే ఆహారం వల్లే కాకుండా.. మానసిక ఒత్తిడి వల్ల కూడా వస్తోంది. ఈ విషయాన్ని డాక్టర్ అరుంధతి కె.ఎస్.(సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు, అపోలో ఆయుర్వేద హాస్పిటల్స్) కూడా వివరించారు. ఆ విషయాలు తెలుసుకుందాం.


మానసిక ఒత్తిడి మనసు, నిద్రను ప్రభావితం చేయడమే కాకుండా, జీర్ణవ్యవస్థకు కూడా సమస్యల్ని కలిగిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి కడుపు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మలబద్ధకానికి కారణమవుతుంది. ముఖ్యంగా పని ఒత్తిడి, ఆందోళన లేదా పరీక్షల సమయంలో మన శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు పెరుగుతాయి. దీంతో జీర్ణక్రియ మందగిస్తుంది. ఆకలి తగ్గుంది. ఇది మలబద్ధకానికి కారణమవుతుంది.


ఒత్తిడి, మలబద్ధకానికి మధ్య సంబంధం ఏంటి?


మానవ శరీరానికి గట్-మెదడు మధ్య చాలా లోతైన సంబంధం ఉంది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్, ఇతర ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. పబ్‌మెడ్ సెంట్రల్‌లో పబ్లిష్ అయిన ఓ నివేదిక ప్రకారం ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు సాధారణ జనాభా కంటే 50 శాతం ఎక్కువగా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (IBS), మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలతో బాధపడే అవకాశం ఉందని తేలింది.


ఒత్తిడి వల్ల ఏం జరుగుతుంది?


పేగులకు రక్త ప్రసరణ తగ్గుతుంది.


జీర్ణక్రియ మందగిస్తుంది.


ఆకలి తగ్గుతుంది.


ఆయుర్వేదం ప్రకారం ఇది 'వాత దోషం' అంటే నరాల వ్యవస్థ - పేగుల కదలికలకు సంబంధించింది. ఇది అసమతుల్యతకు దారి తీస్తుంది అని డాక్టర్ తెలిపారు.


ఒత్తిడి గట్ బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది


ఆరోగ్య నిపుణుల ప్రకారం దీర్ఘకాలిక ఒత్తిడి పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకానికి దారితీస్తుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియా యొక్క ఈ అసమతుల్యత వల్ల ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం ఇంకా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో ఒత్తిడి మంచి బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీంతో మలం పేగుల్లో చిక్కుకుంటుంది. దీని వల్ల మలవిసర్జన కష్టతరం అవుతుంది. ఇది మలబద్ధకానికి కారణమవుతుంది.


ఒత్తిడి మలబద్ధకానికి ఎందుకు కారణమవుతుంది?


మానసిక ఒత్తిడి కారణంగా ఆకలిని కోల్పోవచ్చు. ఎక్కువ ఆకలిగా అనిపించవచ్చు. దీంతో, సమయ పరిమితి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినవచ్చు. దీంతో, మలబద్ధకం సమస్యను ఎదుర్కొనే ప్రమాదం పెరుగుతుంది.


దీర్ఘకాలిక ఒత్తిడి శరీరాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు. ఇది పోరాటం లేదా పారిపోవడం అనే మోడ్‌లోకి నెడుతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.


ఒత్తిడి వల్ల ఆహారపు అలవాట్లపై ఎక్కువ ప్రభావం పడొచ్చు. తక్కువ నీరు తాగడం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం రావచ్చు.


ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?


మలం గట్టిగా రావడం: మలబద్ధకం వల్ల మలం సాధారణం కంటే గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మలం బయటకు రావడం కష్టమవుతుంది. కొన్నిసార్లు ఇది బాధాకరంగా కూడా ఉంటుంది. ఇలా జరుగుతుంటే మీరు ఒత్తిడితో కూడిన మలబద్ధకంతో బాధపడుతున్నారని అర్థం.


మలవిసర్జన సాఫీగా జరగకపోవడం: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన చేస్తే అది మలబద్ధకానికి స్పష్టమైన సంకేతం. డాక్టర్ అరుంధతి ప్రకారం ఆరోగ్యకరమైన వ్యక్తి సాధారణంగా ప్రతి రోజూ మలవిసర్జన సాఫీగా చేస్తాడు.


కడుపు పూర్తిగా ఖాళీ కాలేదనే భావన: బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత కూడా రిలీఫ్ లేకపోతే లేదా మీ పేగులు పూర్తిగా క్లియర్ కాలేదని భావిస్తే అది మలబద్ధకానికి సంకేతం కావచ్చు. మలవిసర్జన చేయడానికి చాలా సమయం తీసుకుంటే కూడా అది ఒత్తిడితో కూడిన మలబద్ధకానికి కారణం.


కడుపు నొప్పి, ఉబ్బరం, కడుపులో శబ్దాలు రావడం: ఇలాంటి లక్షణాలు కనిపించినా అది మలబద్ధకానికి సంకేతం అని అర్థం చేసుకోవాలి.


నివారణ మార్గాలు


1. జీవనశైలి మార్పులు:


ప్రతిరోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా ప్రశాంతంగా, నిదానంగా నమిలి తినాలి.


సరైన సమయంలో మలవిసర్జన చేసే అలవాటు అలవర్చుకోవాలి.


రాత్రి భోజనం తేలికగా ఉండాలి. వీలైతే ఏడు గంటలలోపే భోజనం పూర్తి చేయాలి.


2. అలవాట్లు, వ్యాయామం:


ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగాలి.


యోగా, ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి పేగుల కదిలికలు మెరుగుపడతాయి.


నిద్ర కూడా ముఖ్యమే. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు గాఢ నిద్ర పోయేలా ప్లాన్ చేసుకోవాలి.


3. ఆహార నియమాలు:


పీచు పదార్థాలు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే బొప్పాయి, జామ పండు, బార్లీ వంటివి తీసుకోవాలి.


మధ్యాహ్నం భోజనంలో పెరుగు లేదా పల్చటి మజ్జిగ తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.


రాత్రి పూట నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్షను ఆ నీటితో సహా తీసుకోవడం లేదా రాత్రిపూట వేడి అన్నం గంజిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తినడం వల్ల మలవిసర్జన సాఫీగా అవుతుంది.


ప్రాసెస్ చేసిన ఆహారానికి, అర్థరాత్రి పూట తినే అలవాటుకు దూరంగా ఉండాలి.


బోవల్ రిథమ్ పాటించండి


మన శరీరం ఒక గడియారంలా పనిచేస్తుంది. దానిని క్రమబద్ధీకరించడానికి చిన్న చిట్కాలు పాటించాలి.


సరైన పొజిషన్: ఈ రోజుల్లో చాలా మంది వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నారు. వెస్ట్రన్ టాయిలెట్ వాడుతున్నప్పుడు పాదాల కింద ఒక చిన్న స్టూల్ పెట్టుకోవడం వల్ల మల విసర్జన సహజంగా, సులభంగా జరుగుతుంది.


ముందుగా మేల్కొనడం: సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వల్ల శరీరంలోని వాతం సహజంగా మల విసర్జనకు సహకరిస్తుంది.


ఫోన్ వాడకండి: టాయిలెట్‌లో ఉన్నప్పుడు పేపర్లు చదవడం లేదా ఫోన్ వాడటం వల్ల మెదడుకు, పేగులకు ఉన్న సంబంధం దెబ్బతింటుంది. దీనివల్ల మల విసర్జన ప్రక్రియ ఆలస్యమవుతుంది.


గమనించాల్సిన ముఖ్య విషయం


ఒత్తిడి వల్ల వచ్చే మలబద్ధకానికి మనసు ప్రశాంతంగా ఉండటం అత్యంత ముఖ్యం. రాత్రిపూట కనీసం 7-8 గంటల గాఢ నిద్ర లేకపోతే ఏ మందులు వాడినా ఫలితం తక్కువగానే ఉంటుంది. ఒకవేళ సమస్య తగ్గకుండా వేధిస్తుంటే నిపుణులైన వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. ఎందుకంటే మలబద్ధకంలో రకాలను బట్టి చికిత్స మారుతుంది.

Latest News
Dr Rajendra Prasad remembered on his 63rd death anniversary; CM Nitish pays floral tribute Sat, Feb 28, 2026, 03:21 PM
CM Gupta launches HPV vaccination drive; Delhi aims to vaccinate 1.6 lakh girls in three months Sat, Feb 28, 2026, 03:11 PM
AGuH adopts stealth strategy: Expands in North, lies low in J&K Sat, Feb 28, 2026, 02:42 PM
India vs West Indies head-to-head record and last five matches performance Sat, Feb 28, 2026, 02:38 PM
India urges nationals in Israel to stay alert after Israel US strikes on Iran Sat, Feb 28, 2026, 02:31 PM