|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 01:21 PM
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుదామని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై రేపు కడపలో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమ రూపకల్పనపై ఈ టెలి కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చించారు.ఈ టెలికాన్ఫరెన్స్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ...రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై పార్టీ చేపట్టిన సన్నాహక కార్యక్రమానికి ప్రజల్లో విశేష స్పందన లభించిందన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల భవిష్యత్తుకు ఈ ప్రాజెక్ట్ లైఫ్‌లైన్‌లాంటిదని స్పష్టం చేశారు.ఈ ప్రాజెక్ట్ కేవలం సాగునీటి అవసరాలకే కాకుండా తాగునీటి భద్రతకూ కీలకమని, భవిష్యత్ తరాలకు రక్షణ కల్పించే ప్రణాళికగా జగన్ గారు దాన్ని రూపకల్పన చేశారని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర అనుమతులు తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు.రాయలసీమ లిఫ్ట్ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రతి ఇంట్లో ఈ అంశంపై చర్చ జరిగేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమావేశాలు, చర్చావేదికలు, ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఈ అంశాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించామని, రేపు కడపలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం జరుగుతుందని తెలిపారు.
Latest News