|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 03:16 PM
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో అత్యాధునిక, విధ్వంసకర ఆయుధాలను ప్రయోగించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వెల్లడైంది. ఈ దాడుల్లో ప్రధానంగా 'టోమహాక్' క్రూయిజ్ క్షిపణులు, సరికొత్త 'లూకాస్' సూసైడ్ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రయోగించిన టోమహాక్ క్రూయిజ్ క్షిపణులు ఈ ఆపరేషన్‌లో పెను విధ్వంసం సృష్టించాయి. రేథియాన్ కంపెనీ తయారు చేసే ఈ క్షిపణులు సుమారు 1,600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలవు. రాడార్లను తప్పించుకుని, శత్రు రక్షణ వ్యవస్థలను దాటుకుని ప్రయాణించడం వీటి ప్రత్యేకత. సుమారు 13 లక్షల డాలర్ల విలువైన ఒక్కో క్షిపణి, నిర్దేశిత లక్ష్యాన్ని నేరుగా తాకి పూర్తిగా నాశనం చేయగలదు. ఇటీవల యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై కూడా అమెరికా వీటిని ప్రయోగించింది.అలానే ఈ యుద్ధంలో అమెరికా మొట్టమొదటిసారిగా 'లూకాస్' (లో-కాస్ట్ అన్‌మ్యాన్డ్ కంబాట్ ఎటాక్ సిస్టమ్) అనే సూసైడ్ డ్రోన్లను రంగంలోకి దించింది. ఇరాన్ వినియోగించే షాహెద్ డ్రోన్ల తరహాలో తక్కువ ఖర్చుతో వీటిని రూపొందించారు. అరిజోనాలోని స్పెక్టర్‌వర్క్స్ కంపెనీ తయారు చేసిన ఈ డ్రోన్ల విలువ ఒక్కొక్కటి సుమారు 35,000 డాలర్లు మాత్రమే. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రాచుర్యం పొందిన 'అఫోర్డబుల్ మాస్' (తక్కువ ధరలో భారీ ఉత్పత్తి) వ్యూహంలో భాగంగా వీటిని అభివృద్ధి చేశారు. తక్కువ ఖర్చుతో వేల సంఖ్యలో ప్రయోగించి శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసే వీలుంటుంది.
Latest News