|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 07:18 PM
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తూ పేదలపాలిట సంజీవనిగా పేరుతెచ్చుకుంది కృష్ణా జిల్లా కూచిపూడిలోని సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి. 2015 సంవత్సరంలో సిలికానాంధ్ర జగమంత కుటుంబం అనే సంస్థ కూచిపూడి అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ సమయంలోనే ఈ ప్రాంత ప్రజల కోసం అధునాతన సౌకర్యాలతో ఆస్పత్రి నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్, కూచిభొట్ల ఆనంద్‌తో పాటుగా మరికొందరు దాతలు.. ఆస్పత్రి నిర్మాణం కోసం ముందుకు వచ్చారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభించారు.
ఈ ఆస్పత్రిలో పీడియాట్రిక్, గైనకాలజీ విభాగాలతో పాటుగా కిడ్నీ, ఎముకలు, దంతాలు, గుండె, ఊపిరితిత్తులు, మధుమేహం, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, నరాలు, రేడియాలజీ, చర్మవ్యాధులు, ఫిజియోథెరపీ, డయాలసిస్ సేవలు ఉచితంగా అందిస్తున్నారు. చిన్న పిల్లలు, గర్భిణులు తప్ప మిగిలిన వారికి వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, మందులతో పాటుగా ఎక్స్‌రే, స్కానింగ్‌పై 50 శాతం వరకూ రాయితీ ఇస్తున్నారు. అలాగే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలను నామమాత్రపు ఖర్చుతో చేస్తున్నారు.
పేదలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కూచిపూడి గ్రామంలో 200 పడకల సౌకర్యంతో ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. కూచిపూడితో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 70 గ్రామాల ప్రజలకు ఈ ఆస్పత్రి ద్వారా సేవలు అందుతున్నాయి. ఈ ఆస్పత్రిలో నిత్యం సుమారు 450 మంది చికిత్స తీసుకుంటున్నారు. 2025 సంవత్సరంలో సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి ద్వారా.. 40,785 మందికి వైద్యం అందించారు. వీరిలో 3,077 మంది అవుట్ పేషెంట్లు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అలాగే 486 మందికి రాయితీపై కాన్పులు చేశారు. ఉచితంగా 202 మందికి కాన్పులు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 311 మందికి డయాలిసిస్ చేసినట్లు తెలిపాయి.
Latest News