|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 08:42 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మార్చి 1) రెండు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పుదుచ్చేరిలో రూ.2,700 కోట్లు, తమిళనాడులో రూ.4,400 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. తమిళనాడులో కొత్తగా నిర్మించిన ఎనిమిది అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, మూడు కొత్త ఆల్ ఇండియా రేడియో ఎఫ్‌ఎమ్ రిలే ట్రాన్స్మిటర్లను కూడా ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం మధురైలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఎన్డీఏ ఆధ్వర్యంలో మధురైలో నిర్వహించిన సభకు హాజరైన ప్రధాని, రూ.4,400 కోట్ల విలువైన సంక్షేమ పథకాలకు సంబంధించిన సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. సభ అనంతరం తిరుపరంకుండ్రంలోని సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా “వెట్రివేల్” అంటూ తమిళంలో నినదించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అమ్మ మీనాక్షి సుందరేశ్వరర్ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.తిరుపరంకుండ్రం సందర్శన సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న పూరణచంద్రన్ ఘటనను ప్రస్తావిస్తూ, అతని కుటుంబానికి తన సానుభూతిని తెలిపారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సు కోసం, దేశ సమగ్రాభివృద్ధి కోసం ప్రార్థించానని చెప్పారు.ఇక తమిళనాడు డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “మోసం చేయడంలో డీఎంకే మంత్రులు పోటీ పడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు స్వచ్ఛమైన పరిపాలన కోరుకుంటున్నారని, తదుపరి ప్రభుత్వం ఎన్డీఏదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.“డీఎంకేలో ఒకరు నేను వారికి లేదా వారి కుటుంబానికి భయపడనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వారు నన్ను విమర్శించకపోతే, అది నాకు ఇచ్చిన ప్రశంసాపత్రమే” అని ప్రధాని చమత్కరించారు.డీఎంకే ప్రభుత్వం అవినీతి, కుటుంబపాలనతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని ఆరోపించిన ఆయన, మధురై ప్రజలు ఎంజీఆర్‌కు అండగా నిలిచిన చరిత్రను గుర్తు చేశారు. తమిళనాడు కాంగ్రెస్‌కు దూరంగా నిలిచిన రాష్ట్రంగా చరిత్రలో నిలిచిందని, కాంగ్రెస్‌పై కూడా ఆయన మండిపడ్డారు.
Latest News