థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి....తీవ్రంగా ఖండించిన భారత్
 

by Suryaa Desk | Thu, Mar 12, 2026, 07:24 PM

భారత్‌కు వస్తున్న ఆయిల్ ట్యాంకర్ థాయ్‌లాండ్ నౌక మయూరీ నారీ బ్యాంకాక్‌పై హర్మూజ్ జల సంధిలో ఇరాన్ క్షిపణులతో దాడిచేసిన విషయం తెలిసిందే. తాజాగా, దాడిపై భారత ప్రభుత్వం స్పందించింది. ‘వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం విచారకరం’ అని.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని న్యూఢిల్లీలో పేర్కొంది. ‘వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలి’ అని నొక్కి చెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లోని ఖలీఫా పోర్టు నుంచి చమురు నింపుకుని హర్మూజ్ జల సంధి మీదుగా గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకి వస్తున్న థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ క్షిపణితో దాడిచేశారు. దీంతో నౌకలో మంటలు చెలరేగి, సగభాగం కాలిపోయింది. అందులోని 23 మంది సిబ్బంది ఉండగా.. 20 మందిని రక్షించామని, మిగతా ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.


 ఈ ఘటనపై విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ‘‘భారత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తున్న థాయ్‌లాండ్ ఆయిల్ ట్యాంకర్ నౌక మయూరీ నారీపై హర్మూజ్ జల సంధిలో మార్చి 11న దాడి జరిగిందనే నివేదికలను మేము గమనించాం.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక ఘర్షణల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడాన్ని భారత్ ఖండిస్తోంది.. ఈ సంఘర్షణ తొలి దశలో జరిగిన అనేక దాడుల్లో భారతీయ పౌరులతో సహా విలువైన ప్రాణాలను ఇప్పటికే కోల్పోయారు.. దాడుల తీవ్రత, ప్రాణభయం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది’’ అని ప్రకటన విడుదల చేసింది.


‘‘వాణిజ్య షిప్పింగ్‌ను లక్ష్యంగా చేసుకుని, అమాయక సిబ్బందిని ప్రమాదంలో పడేయడం లేదా నావిగేషన్, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం మానుకోవాలని భారతదేశం పునరుద్ఘాటిస్తుంది’’ అని పేర్కొంది. ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు సరఫరా జరిగే హర్మూజ్ జలసంధిలో రవాణాను ఇరాన్ సమర్థవంతంగా నిలిపివేసింది. గల్ఫ్ దేశాలలో ఆయిల్ రిఫైనరీలు, చమురు క్షేత్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులను ముగించేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ అస్త్రాన్ని ఇరాన్ వాడుతోంది. ప్రపంచ చమురు సంక్షోభాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.


తమ హెచ్చరికలను పట్టించుకోకుండా హర్మూజ్ జల సంధి ద్వారా రవాణాకు ప్రయత్నించడంతోనే లైబీరియన్ జెండాతో ఉన్న కంటెయినర్ నౌక ఎక్స్‌ప్రెస్ రోమ్, థాయ్‌లాండ్ నౌక మయూరీ నారీలపై దాడిచేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ( ఐఆర్జీసీ) ప్రకటించింది. ఐఆర్జీసీ నావికాదళ కమాండర్ అలిరేజా టాంగ్సిరి సోషల్ మీడియా పోస్ట్‌లో ‘ఏ నౌక అయినా దాటాలనుకుంటే ఇరాన్ నుంచి అనుమతి తీసుకోవాలి’ అని అన్నారు.


అటు, ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటనలో అమెరికా, ఇజ్రాయెల్ లేదా వారి మిత్రదేశాలకు చెందిన ఏదైనా నౌకను చట్టబద్ధమైన లక్ష్యంగా పరిగణిస్తామని ప్రకటించింది. జలసంధి ద్వారా ఒక్క లీటరు చమురును రవాణా చేయడానికి ఇరాన్ అనుమతించదని హెచ్చరించింది.

Latest News
No plans yet to attend next round of talks with US: Iran Mon, Apr 20, 2026, 04:44 PM
Nepal: Govt employees to receive salary on fortnightly basis Mon, Apr 20, 2026, 04:12 PM
Over 6,000 Afghan refugees repatriated from Pakistan in single day Mon, Apr 20, 2026, 04:09 PM
ECI announces 48-hour 'Dry Day' ahead of polling in West Bengal, Tamil Nadu Mon, Apr 20, 2026, 03:19 PM
BJP will end hooligans' rule in West Bengal: Rajnath Singh Mon, Apr 20, 2026, 03:05 PM