మొజ్తబా ఖమేనీ ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడు...డొనాల్డ్ ట్రంప్
 

by Suryaa Desk | Fri, Mar 13, 2026, 07:19 PM

 పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతుల్లా మొజ్తాబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా? లేదా? అన్న సందేహాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొజ్తాబా ఖమేనీ "ఏదో ఒక రూపంలో బతికే ఉన్నాడని" తాను నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆయన తీవ్రంగా గాయపడి ఉండవచ్చని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.


కోమాలో ఉన్నారా?


ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్‌లోని కాంపౌండ్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడుల్లో మోజ్తాబా తండ్రి, అప్పటి సుప్రీం నేత అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే అదే దాడిలో మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో గుప్పుమన్నాయి. ఫాక్స్ న్యూస్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. "అతడు బహుశా బతికే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. కానీ అతడికి చాలా నష్టం జరిగింది" అని వ్యాఖ్యానించారు.


తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో..?


ఇరాన్ రాయబారి అలీరెజా సలారియన్ కూడా మొజ్తాబా గాయపడినట్లు ధ్రువీకరించారు. ఆయన చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని, అందుకే రహస్య ప్రదేశంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మొజ్తాబా భార్య, సోదరి, మేనకోడలు కూడా గత నెలలో జరిగిన దాడుల్లో మరణించారని స్పష్టం చేశారు. అందుకే బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రజల ముందుకు రాలేదని.. కనీసం వీడియో ప్రసంగం కూడా చేయలేదని అలీరెజా సలారియన్ చెప్పారు. "మొజ్తబా కనీసం మాట్లాడగలిగే స్థితిలో కూడా లేరు" అని ఆయన పేర్కొనడం అనేక అనుమానాలకు తావిచ్చింది.


ఇరాన్ నూతన సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొజ్తాబా ఖమేనీ పేరుతో తొలిసారి ఒక ప్రకటన వెలువడింది. "మా అమరవీరుల రక్తం వృధా పోనివ్వం.. ప్రతీకారం తీర్చుకుంటాం" అని ఆయన ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే హార్మూజ్ జలసంధిని మూసి వేయాలని, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేయాలని ఆయన కోరారు. అయితే ఈ సందేశం ఆడియో, రాతపూర్వక రూపంలోనే ఉంది తప్ప.. ఆయన కనీసం వీడియో ద్వారా కూడా ప్రజల ముందుకు రాలేదు. ఇవన్నీ చూస్తుంటే.. ఆయన ఈ దాడిలో చాలా గట్టిగానే గాయపడినట్లు అర్థం అవుతోంది.

Latest News
Seoul shares sharply up on US-Iran ceasefire Wed, Apr 08, 2026, 11:01 AM
20,000 women to be screened for HPV in Mongolia this year Wed, Apr 08, 2026, 10:54 AM
Forest guard killed as sand mafia attacks raiding team in MP's Morena Wed, Apr 08, 2026, 10:48 AM
Bayern win beat Real Madrid to take advantage in UCL quarterfinal Wed, Apr 08, 2026, 10:39 AM
IPL 2026: Jaiswal's unbeaten 77 helps RR post 150/3 against MI in rain-reduced match Wed, Apr 08, 2026, 10:32 AM