షెడ్యూల్‌ విడుదలకు గంట ముందే మమతా బెనర్జీ ఉద్యోగులకు బంపరాఫర్
 

by Suryaa Desk | Sun, Mar 15, 2026, 07:28 PM

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు గంట ముందు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో ఆస్త్రాన్ని బయటకు తీశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏపై ఆమె ప్రకటన చేశారు. షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో గంట ముందే ఆమె డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2009 నుంచి డీఏ బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తున్నట్టు ప్రకటించారు. దీని వల్ల వేలాది మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ‘‘మా ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లలో వివరించిన ప్రకారం.. ఉద్యోగులు మార్చి 2026 నుంచి తమ ROPA 2009 DA బకాయిలను అందుకోనున్నారు’’ అని దీదీ ఎక్స్‌ (ట్విట్టర్)లో తెలిపారు. పశ్చిమ్ బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇది ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వస్తుందా? ఉల్లంఘనా? అనేది ఈసీ స్పష్టతనిచ్చింది. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ.. సంబంధిత రాష్ట్రాలలో కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. దీనికి ముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీఏ పెంపు సహా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు లేదా చేసిన ప్రకటనలు కోడ్ ఉల్లంఘన కాదని తెలిపింది. వీటికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తించదని తేల్చిచెప్పింది.


  దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో దీదీ నుంచి ప్రకటన వెలువడింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న చర్యగా దీనిని భావిస్తున్నారు. ప్రతిపక్ష బీజేపీ దీనిపై విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి దీనిని ‘జోక్’ అని అభివర్ణించారు.


‘‘ఏళ్లుగా ఖజానాను దోచుకుని, ఉద్యోగులను గుడ్డిగా మోసం చేసిన తర్వాత చివరి నిమిషంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎన్నికల గిమ్మిక్ కాదా? వాస్తవానికి ఒక్క పైసా కూడా విడుదల కాదు.. చివరిసారిగా ప్రజలను మోసం చేయడానికి ఆర్థిక శాఖ నుంచి ఖాళీ నోటిఫికేషన్లు మాత్రమే విడుదలవుతాయి.. టీఎంసీ క్లాసిక్ ఎన్నికల డ్రామా’’ అని సువేందు విమర్శలు గుప్పించారు.


బకాయిలు సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కరువు భత్యం చెల్లించాలని కోరుతూ ఉద్యోగులు మొదట కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, కలకత్తా హైకోర్టుల నుంచి ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. మే 2022లో రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా DA చెల్లించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేసింది.


గత ఏడాది మే నెలలో పెండింగ్‌లో ఉన్న బకాయిలలో 25 శాతాన్ని ఆరు వారాల్లోగా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ, ఆర్థిక సంక్షోభం కారణంగా చెల్లించలేకపోయిన బెంగాల్ ప్రభుత్వం.. మరో ఆరు నెలల సమయం కోరింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌లో, చెల్లించాల్సిన DA బకాయిల కోసం ఎటువంటి నిధుల కేటాయించలేదు.


Latest News
RBI postpones capital market exposure framework to July 1 Tue, Mar 31, 2026, 11:32 AM
Vietnam's capital logs 29 COVID-19 cases since start of year Tue, Mar 31, 2026, 11:27 AM
PM Modi inaugurates Samrat Samprati Museum in Gandhinagar Tue, Mar 31, 2026, 11:15 AM
Cop dies of accidental firearm injury in J&K's Shopian Tue, Mar 31, 2026, 11:00 AM
PM Modi to inaugurate Samrat Samprati Museum, launch key development projects in Gujarat today Tue, Mar 31, 2026, 10:47 AM