|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 08:41 PM
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ఏప్రిల్ 2న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టంలో స్పష్టంగా చేర్చడం ఈ సవరణ లక్ష్యం.రాష్ట్ర శాసనసభ తీర్మానం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ దీనిని లోక్‌సభలో ప్రవేశపెట్టారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. వైఎస్సార్సీపీ వాకౌట్ చేయడంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లైంది.బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలోనూ, బయటా కూడా వివిధ రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెప్పిన జగన్, మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మూడు నగరాల పేర్లతో “మావిగన్” అనే కొత్త రాజధాని ప్రతిపాదనను కూడా ఆయన ముందుకు తెచ్చారు.ఇక, విశాఖపట్నం రాజధానిగా ఉండాల్సిందని సమాజ్‌వాది పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు.చర్చ సందర్భంగా తెలంగాణ ఎంపీలు విభజన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తగా, మరికొందరు ఎంపీలు రైతులకు న్యాయం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను మళ్లీ ముందుకు తెచ్చింది.జగన్ మాట్లాడుతూ, అమరావతి ప్రాజెక్టులో భారీ ఖర్చులు, అవినీతి జరుగుతున్నాయని ఆరోపించారు. లక్ష ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి భారీగా నిధులు అవసరమవుతాయని, ఇది ఆచరణలో సాధ్యం కాదని అన్నారు.మూడు రాజధానుల ప్రతిపాదన వెనుక ఎలాంటి స్వార్థం లేదని స్పష్టం చేసిన జగన్, రాష్ట్ర అభివృద్ధి కోసం విశాఖను గ్రోత్ ఇంజిన్‌గా అభివృద్ధి చేయాలని తమ ఉద్దేశమని తెలిపారు.అదే సమయంలో, “ప్లాన్ బి”గా మావిగన్ ప్రతిపాదనను ప్రస్తావిస్తూ, మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉన్న హైవేను క్యాపిటల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తే పెద్ద నగరంగా మారే అవకాశముందని చెప్పారు.ఇక, జగన్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. అమరావతి అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది.లోక్‌సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాజధాని స్పష్టత లేకపోవడం వల్ల పెట్టుబడులు రావడంలో ఆటంకాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ చట్ట సవరణతో ఆ అనిశ్చితి తొలగి అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేకుండా వదిలేశారని విమర్శిస్తూ, ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.అయితే, ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వ్యక్తం చేసింది. రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేర్చుతారో చెప్పాలని ఆ పార్టీ ప్రశ్నించింది.
Latest News