![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jan 31, 2025, 11:17 AM
గ్రామ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సర్కారు సై అంటోంది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కసరత్తు చేస్తూనే, ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెబితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. పరిణామాలను బట్టి పిబ్రవరి రెండో వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ, వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను సిద్ధంచేసేందుకు షెడ్యూల్ విడుదల చేయడం గమనార్హం. నిరుడు 86 గ్రామ పంచాయతీలను సమీప కార్పొరేషన్‌లలో, మునిసిపాలిటీల్లో విలీనం చేశారు. ఇందులో కొన్నింటిని కొత్త మునిసిపాలిటీలుగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీ ఓటర్ల జాబితాలో నుంచి ఆయా గ్రామాల ఓటరు లిస్టులను తొలగించనున్నారు. ఆ తర్వాత పంచాయతీ ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్‌కుమార్ గురువారం ఆదేశాలు జారీచేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశాల్లో సూచించారు.అనుబంధ ఓటరు జాబితాను ఫిబ్రవరి 3వ తేదీలోగా ప్రకటించాలని సూచించారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 4న ఎంపీడీవో మండల స్థాయిలో రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించాలని, ఫిబ్రవరి 6న అనుబంధ ఓటరు తుదిజాబితాను ప్రకటించాలని సూచించారు. వీటితో పాటుగా గతంలో గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను ప్రకటించిన సమయంలో వివిధ కారణాలతో 64 గ్రామ పంచాయతీల్లో రూపొందించలేదు. ఈ నేపథ్యంలో వాటి తుదిఓటరు జాబితాను తయారుచేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈనెల 3న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించాలని, దీనికి తాజాగా ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరుజాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. 4న మండలస్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని, 5వ తేదీకల్లా అభ్యంతరాలను స్వీకరించాని, 6న వాటిని పరిష్కరించాలని, 7న తుది ఓటరుజాబితాను 64 గ్రామాలు సహా అన్ని పంచాయితీలకు 7న ప్రకటించాలని వెల్లడించారు.
ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేవిధంగా ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. ఇందుకు అనుగుణంగా ప్రతి మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీలు ఉండే విధంగా విభజన చేయాలని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. గురువారమే ఈ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 3వ తేదీ కల్లా ఎంపీటీసీ స్థానాల విభజన ప్రక్రియ పూర్తిచేయాలని సూచించడంతో పంచాయతీ విభాగాలు, మండల అభివృద్ధి అధికారులు తమ పరిధిలోని గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ స్థానాల వివరాలను సిద్ధంచేశారు. శుక్రవారం వరకు అభ్యంతరాలను స్వీకరించాలని, ఫిబ్రవరి 2 వరకు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాలని, 3న తుది ఎంపీటీసీ పరిధి జాబితాను ప్రకటించాలని పీఆర్ కార్యదర్శి ఆదేశించారు.
7న అసెంబ్లీ సమావేశం?
వీలైనంత త్వరగా పంచాయతీల నిర్వహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కార్యాచరణ కొనసాగుతోంది. అందులో భాగంగానే పిబ్రవరి 7న అసెంబ్లీ సమావేశం ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలున్నాయి. బీసీ రిజర్వేషన్లను పెంచాలంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిబంధనలు మార్చాల్సి ఉంటుంది. అది కేంద్రం పరిధిలోనే ఉండటంతో దీనిపై అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తిచేశాక కేంద్ర స్పందన కోసం కొన్నాళ్లు వేచిచూసి.. ఒకవేళ సానుకూల సంకేతాలు రాకుంటే.. పార్టీ పరంగానే బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలుచేసే ఉద్దేశం కూడా అధికార కాంగ్రె్‌సలో కనిపిస్తోంది.