![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jan 31, 2025, 07:22 PM
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ ఒక్క వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హెచ్ఎండీఏ గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ఈ వాకథాన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం.. జెండా ఊపి వాకథాన్‌ను ప్రారంభించారు. రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్‌పై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ వాకథాన్‌లో రవాణా శాఖ అధికారులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. స్కూళ్లలో రహదారి భద్రతను ఒక పాఠ్యాంశంగా తీసుకోవడం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణించేటపుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను రక్షించాలని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని.. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలని.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు జరిగాయి.
రోడ్డు భద్రతపై అందరికీ అవగాహన చాలా అవసరమని.. దాని వల్ల మనం ఒక్కరిని కాపాడినా చాలా సంతోషమని తెలిపారు. బ్లాక్ స్పాట్స్ ఉన్న వాటిని గుర్తించి వాటిని పూడ్చే ప్రయత్నం మొదలైందని వివరించారు. రవాణా శాఖ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకున్నామ మంత్రి తెలిపారు. వేగం థ్రిల్ ఇస్తుంది కానీ దాన్ని చంపుతుందని చెప్పారు.