|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 07:40 PM
నిర్వహణ లోపం కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో పలు విమానాలను రద్దు చేస్తోంది. నేడు కూడా 400 విమానలను రద్దు చేసింది. ఇండిగో నిర్ణయం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పని నిమిత్తం వెళ్లల్సిన వారు విమానాశ్రయంలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. ఇతర విమానయాన సంస్థలను ఆశ్రయిస్తే.. అవి ధరలను భారీగా పెంచి ప్రయాణికులను దోచుకుంటున్నాయి. విమానాల రద్దు గురించి ముందే సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడుతున్నారు. ఇండిగో మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి తెలంగాణ ఆర్టీసీ ముందుకు వచ్చింది. ప్రయాణికులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నైకు ప్రత్యేకంగా స్లీపర్ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చింది. శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ఆర్టీసీ స్లీపర్ బస్సులు.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నుంచి బయల్దేరనున్నాయి.
శనివారం సాయంత్రం నుంచి శంషాబాద్ విమానాశ్రయం అరైవల్ ర్యాంప్ – పిల్లర్ నంబర్ 08 దగ్గర నుంచి 2 స్లీపర్ బస్సులు నడపనుంది. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు చెన్నై, బెంగళూరుకు ఒకటి చొప్పున బస్సులు బయలు దేరనున్నాయి. చెన్నై వెళ్లడానికి ఒక వ్యక్తికి టికెట్ ధర రూ. 2110, బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ. 1670 గా ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. వీటితో పాటు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి విశాఖ, కాకినాడ, రాజమండ్రి వరకు అదనపు బస్సులు జోన్ డీ నుంచి నడవనున్నాయి. ఇక ఇండిగో విమానాల రద్దుతో భారతీయ రైల్వే కూడా ప్రయాణికులు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య నగరాల మధ్య నడిచే 37 ప్రీమియం రైళ్లలో 116 బోగీలను అదనంగా జత చేసింది. దక్షిణ రైల్వే రైళ్లకే అత్యధికంగా బోగీలను ఏర్పాటు చేసింది.
ఇక వందల కొద్ది విమానాలను రద్దు చేస్తూ దేశీయ వైమానిక రంగంలో తీవ్ర సంక్షోభం సృష్టించిన ఇండిగో సంస్థ మీద కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిది. విమానాలను ఆకస్మికంగా రద్దు చేయడమే కాక.. ప్రయాణ వాయిదాల నివారణ కోసం తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రయాణికుల టికెట్ రద్దు రీఫండ్ మొత్తం చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని సూచించింది.
ఆదివారం రాత్రి 8 గంటల లోపు ప్రయాణికుల టికెట్ డబ్బులు తిరిగి వారికివ్వాలనిహెచ్చరించింది. అలానే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేంద్ర విమానయాన శాఖ శనివారం సాయంత్ర 5 గంటలకు కీలక సమావేశం నిర్వహించనుంది. ఇండిగో యాజమాన్యం ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కేంద్రం ఆదేశించింది.