|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:02 PM
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో కార్యకలాపాలు తీవ్ర గందరగోళంలో పడ్డాయి. పెద్ద ఎత్తున విమానాలు ఆలస్యం కావడం, కొన్ని సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభంపై తక్షణమే స్పందించిన ఇండిగో యాజమాన్యం, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఒక ఉన్నత స్థాయి 'సంక్షోభ నిర్వహణ బృందాన్ని' ఏర్పాటు చేసింది.ఇవాళ జరిగిన ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత సంక్షోభం, దాని తీవ్రతపై యాజమాన్య బృందం బోర్డు సభ్యులకు సమగ్రంగా వివరించింది. అనంతరం బోర్డు సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై, వేగంగా మారుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ ప్రత్యేక కమిటీని నియమించారు.ఈ కమిటీలో ఇండిగో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా, బోర్డు డైరెక్టర్లు గ్రెగ్ సరెట్స్కీ, మైక్ విటేకర్, అమితాబ్ కాంత్, సీఈఓ పీటర్ ఎల్బర్స్ సభ్యులుగా ఉన్నారు. కార్యకలాపాలను తిరిగి గాడిన పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై యాజమాన్యం నుంచి ఈ బృందం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించి, సర్వీసులను సాధారణ స్థితికి తీసుకురావడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొంది.ఇబ్బందులు పడిన ప్రయాణికులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఇండిగో హామీ ఇచ్చింది. విమానాలు రద్దయిన వారికి పూర్తి రిఫండ్ ఇవ్వడంతో పాటు, ప్రయాణ తేదీ మార్పు, రద్దు ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.