|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:15 PM
తెలంగాణ రాష్ట్రంలో రైతులను, ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కోతుల బెడద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. "రైతుల కోసం.. కోతులను పట్టుకుందాం" అనే నినాదంతో ఆయన ప్రారంభించిన ఈ ప్రత్యేక కార్యక్రమంపై స్థానిక ప్రజల నుంచి, ముఖ్యంగా రైతుల నుంచి విశేష ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కోతుల సమస్య దేశవ్యాప్తంగా ఉందని... తాను పార్లమెంట్‌లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినా.. ఏ శాఖ కూడా దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పలేదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో దాదాపు 30 లక్షలకు పైగా కోతులు ఉన్నాయని అంచనా. గత పదేళ్లలో (2014 నుంచి) రెండు ప్రభుత్వాలు కేవలం వందల్లో మాత్రమే కోతులను పట్టుకోగలిగాయని.. ఇది సమస్య తీవ్రతకు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వాలు సమస్యను పట్టించుకోకపోవడంతో.. తానే స్వయంగా రంగంలోకి దిగి ఈ సమస్య పరిష్కారానికి ఒక ప్రత్యేక వాహనాన్ని రూపొందించినట్లు వివరించారు.
ఈ ప్రత్యేక వాహనం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించబడింది. ఈ వాహనం కోతుల బెడద ఎక్కువగా ఉన్న గ్రామాల్లోకి వెళ్లి శాస్త్రీయ పద్ధతిలో కోతులను బంధిస్తుంది. పట్టుకున్న కోతులను జిల్లా కలెక్టర్ సూచించిన విధంగా అటవీ ప్రాంతాల్లో సురక్షితంగా వదిలివేస్తామని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతో ఊరట కలిగించే అంశంగా మారింది. కోతులు పంటలను, పండ్లను నాశనం చేయడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
వ్యక్తిగతంగా ఒక ప్రజాప్రతినిధి ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కొంతమంది రైతులు గతంలో కూడా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు తీసుకుని ఇలా కోతులను పట్టినప్పటికీ.. కొన్ని రోజులకే మరో కోతుల గుంపు గ్రామంలోకి వస్తోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో.. ఎంపీ తీసుకున్న ఈ చర్య కోతుల సంఖ్యను నియంత్రించడానికి, బెడదను శాశ్వతంగా నివారించడానికి ఎంతవరకు దోహదపడుతుందో చూడాలి. కోతులను బంధించిన తర్వాత వాటిని వదిలే అటవీ ప్రాంతాల్లో తగినంత ఆహారం, ఆవాసం ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.