సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత దంపతుల కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పరామర్శించారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల పరిస్థితి పట్ల కేటీఆర్ చలించిపోయారు. ఆ ముగ్గురు పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు తన పిల్లల మాదిరిగానే చదివిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆ పిల్లల పేరిట రూ.2 లక్షల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరల కాంట్రాక్టు రద్దు చేయడం వల్లే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు పెరిగాయని వ్యాఖ్యానించారు. సిగ్గు, లజ్జ ఉంటే చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.