ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యకు పిల్లలు పుట్టట్లేదని.. దారుణంగా హత్య చేశాడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 08:44 PM

ఒకరికి ఒకరై ఉంటామని చేతిలో చెయ్యేసి.. పంచభూతాల సాక్షిగా.. ప్రమాణం చేశాడు. మూడు ముళ్లు వేసుకుని పెళ్లి చేసుకున్నారు. వారి వివాహ బంధానికి 20 ఏళ్లు. కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్లీ దగ్గరయ్యేవారు. కానీ.. 20 వసంతాలు గడిచినా వారి జీవితంలో నిజమైన వసంతం నింపేందుకు సంతానం కలగకపోవటం తీరని లోటుగా మారింది. దాంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వాళ్ల సూటిపోటి మాటలు పెరిగిపోయాయి. అవి తట్టుకోలేక భర్త తాగుడుకు బానిసయ్యాడు. అక్కడితో ఆగకుండా.. నిండు నూరేళ్లు కలిసి ఉంటానని ఏడడుగులు నడిచిన భర్తే.. కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి కాలయముడిగా మారాడు. పైగా.. ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ దారుణమైన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.


ఈ విషాదకర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ శనివారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన మమత (35)కు ఇరవై ఏళ్ల క్రితం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో మమత కుటుంబ సభ్యులు కట్నకానుకలు సమర్పించారు. అయితే, కొంతకాలంగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. పిల్లలు పుట్టలేదన్న మనోవేధనతో మహేందర్ మద్యానికి బానిసై పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు.


రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తన భార్య మమతను పెళ్లి సమయంలో తక్కువ కట్నం ఇచ్చారని, వారికి పిల్లలు కలగడం లేదని నిందిస్తూ తీవ్రంగా వేధించేవాడు. అంతేకాకుండా, మహేందర్‌తో పాటు అతని తల్లి వజ్రవ్వ, తండ్రి లక్ష్మణ్, తమ్ముళ్లు అనిల్, వెంకటేశ్‌లు కూడా మమతను మానసికంగా హింసించేవారు. మహేందర్ ఎలాంటి పనీ చేయకపోవడంతో మమత కరీంనగర్‌లోని ఒక షాపింగ్ మాల్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది.


భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో సుమారు 20 రోజుల క్రితం మల్లాపూర్‌లో పెద్దల సమక్షంలో ఒక పంచాయితీ నిర్వహించారు. ఆ సమయంలో మహేందర్ తన భార్యను బాగా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో మమత తిరిగి అతనితో కరీంనగర్‌లోని అద్దె ఇంటికి వెళ్లింది. అయితే, కొద్ది రోజుల తర్వాత మహేందర్ మమతను ఆమె మెడలోని పుస్తెలతాడు ఇవ్వమని డిమాండ్ చేశాడు. మమత నిరాకరించడంతో ఆగ్రహించిన మహేందర్.. మరో ప్లాన్ వేశాడు. గత నెల 26న మమతను నల్లగొండ, వేములవాడలోని పుణ్యక్షేత్రాలకు దర్శనానికి తీసుకెళ్తున్నానని నమ్మించాడు. దైవ దర్శనం అనంతరం నేరుగా కొడిమ్యాలలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు.


అదే రోజు రాత్రి మహేందర్ ఇంట్లో ఒంటరిగా ఉన్న మమత మెడకు నైలాన్ తాడును బిగించి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మమత మృతదేహానికి నైలాన్ తాడు చుట్టి ఇంటి స్లాబ్‌కు వేలాడదీశాడు. ఆ తర్వాత మమత మెడలో ఉన్న పుస్తెలతాడును తీసుకొని గంగాధరలోని ఒక ఫైనాన్స్ కార్యాలయంలో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బుతో తనకున్న అప్పులను తీర్చుకున్నాడు. ఈ ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా విచారణ జరిపిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


నిందితుడు మహేందర్ శనివారం మోటారుసైకిల్‌పై పారిపోతుండగా చెప్యాల ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు వజ్రవ్వ, లక్ష్మణ్ మరియు తమ్ముళ్లు అనిల్, వెంకటేశ్‌లపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ కూడా పాల్గొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa