ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైడ్రాకు స్వ‌చ్ఛందంగా ఫిర్యాదులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 10:54 AM

ప్ర‌జావాణి ఫిర్యాదుల ప‌రిష్కారంతో హైడ్రాపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెరుగుతోంది. ద‌శాబ్దాల స‌మ‌స్య‌ల‌కు రోజుల్లో హైడ్రా ప‌రిష్కారం చూప‌డంతో ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌స్తున్నారు.  ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు, చెరువులు, నాలాల క‌బ్జాల‌ను చూసి త‌మ‌కెందుకులే అనుకోకుండా.. హైడ్రా ప్ర‌జావాణి కార్య‌క్ర‌మానికి వ‌చ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ర‌హ‌దారిపై ఉన్న ఆటంకాల‌ను వ‌దిలేసి.. చుట్టు తిరిగి వెళ్లే వారు.. ఇప్పుడు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసి రాజ‌మార్గంలో ప్ర‌యాణించాల‌ని చూస్తున్నారు. సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణి ఫిర్యాదుల్లో బాధితుల కంటే సామాజిక కోణంలో ఆలోచించేవారే ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారు. మొత్తం 54 ఫిర్యాదులు ప్ర‌జావాణికి వ‌చ్చాయి. ఫిర్యాదుల‌ను హైడ్రా ఫైర్ విభాగం అద‌న‌పు సంచాల‌కులు శ్రీ వర్ల పాప‌య్య‌ గారు ప‌రిశీలించారు. ఫిర్యాదు వెనుక ఉద్దేశాల‌ను అడిగి తెలుసుకున్నారు. గూగుల్ మ్యాప్స్‌, సాటిలైట్ ఇమేజీల‌తో ఫిర్యాదుల‌ను ప‌రిశీలించి త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను సూచించారు. 


ఫిర్యాదులు ఇలా..
మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా గుడ్ల పోచంప‌ల్లి మున్సిపాలిటీలోని స‌ర్వే నంబ‌రు 136లో 23 గుంట‌ల ప్ర‌భుత్వ స్థ‌లం క‌బ్జా అయ్యింద‌ని.. స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్ర‌భుత్వ స్థ‌లంలోకి వ‌చ్చి ప్ర‌హ‌రీ నిర్మించ‌డంతో పాటు.. భ‌వ‌న నిర్మాణానికి పిల్ల‌ర్లు కూడా వేస్తున్నార‌ని వాపోయారు. స‌ర్వే నంబ‌రు ప‌రిశీలించ‌గా అది ప్ర‌భుత్వ భూమి అని తేల‌డంతో హైడ్రాకు ఫిర్యాదుచేస్తున్నామ‌ని వారు పేర్కొన్నారు.  అలాగే స‌ర్వే నంబ‌రు 692, 693, 701, 717 లో హెచ్ ఎండీఏ లే ఔట్‌లోని పార్కులు క‌బ్జా చేస్తున్నార‌ని ఫిర్యాదుచేశారు. స‌ర్వే నంబ‌రు 713 నుంచి 727 వ‌ర‌కూ 20 ఫీట్ల వ‌ర‌కూ రోడ్డు ఆక్ర‌మ‌ణ జ‌రిగింద‌ని ఫిర్య‌దులో పేర్కొన్నారు. 


 మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా ఉప్ప‌ల్ మండ‌లం, కొత్త‌పేట విలేజీ గాయ‌త్రిపురం కాల‌నీతో పాటు మ‌రో 5 కాల‌నీల‌లో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 3.12 ఎక‌రాల భూమి క‌బ్జా అయ్యిందంటూ ఆయా కాల‌నీవాసులు ఫిర్యాదు చేశారు. 


 మేడ్చ‌ల్ జిల్లా ఉప్ప‌ల్ ప్రాంతంలోని ఫ‌తుల్‌గూడ‌లో త‌న ప్రైవేటు ల్యాండ్‌కు సంబంధించిన స‌ర్వే నంబ‌రు 1, 65 ల‌ను వాడుకుని ప‌క్క‌నే ఉన్న ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. మేడ్చ‌ల్ జిల్లా కీస‌ర మండ‌లం, నాగారం మున్సిపాలిటీలోని జాలుబాయి కుంట‌లో 7 ఎక‌రాల స్థ‌లం క‌బ్జాకు గురి అవుతోంద‌ని  ఫిర్యాదు అందింది. 


రంగారెడ్డి జిల్లా మ‌ణికొండ మున్సిపాలిటీ మీదుగా హుస్సేన్ సాగ‌ర్‌కు వ‌ర‌ద నీటిని తీసుకెళ్లే బుల్కాపూర్ నాలా 55 కిలోమీట‌ర్ల మేర నామ‌రూపాలు లేకుండా క‌బ్జాకు గుర‌య్యింద‌ని.. ఈ నాలా స‌జీవంగా ఉంటే.. 55 కిలోమీట‌ర్ల‌మేర వ‌ర‌ద నీరు కాల‌నీల‌ను ముంచెత్త‌ద‌ని.. దీనిని పున‌రుద్ధ‌రించాల‌ని హైడ్రాకు పుప్పాల‌గూడ ప‌రిస‌ర ప్ర‌జ‌లు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa