ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో 'హైడ్రా' పోలీస్ స్టేషన్ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 08:35 PM

హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర మహానగరాలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల బారిన పడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా పటిష్ట చర్యలు చేపట్టేందుకే 'హైడ్రా'ను ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్‌లోని బుద్ధభవన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బెంగళూరులో తాగునీటి ఎద్దడి, ముంబై, చెన్నై నగరాల్లో వరద బీభత్సం, ఢిల్లీలో వాయు కాలుష్యం వంటి పరిస్థితులు చూస్తున్నామని, అలాంటి దుస్థితి హైదరాబాద్‌కు రాకుండా చూడటానికే ఎన్ని విమర్శలు ఎదురైనా ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.మన పూర్వీకులు అందించిన చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. చెరువులు కనుమరుగైతే మానవ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. 450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సుపరిపాలన కోసం రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించుకున్నట్లే, నగరాభివృద్ధికి గత ముఖ్యమంత్రులు ఎన్నో చట్టాలు చేశారని గుర్తుచేశారు.1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలు నాటి నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయని, దీంతో గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను వినియోగించుకుని మూసీపై డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారని తెలిపారు. పాతబస్తీ అంటే వెనుకబడిన ప్రాంతం కాదని, అది 'ఒరిజనల్ సిటీ' అని భావించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.హైడ్రా అంటే ఇళ్లు కూల్చే విభాగమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ వాస్తవానికి ఇది ప్రభుత్వ, ప్రజా ఆస్తులను కాపాడే వ్యవస్థ అని స్పష్టం చేశారు. చిన్నపాటి వర్షానికే నగరంలోని కాలనీలు నీట మునుగుతున్నాయని, పేదల కాలనీలకు వెళ్లే మార్గాలను కొందరు పెద్దలు ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, కాలనీ రోడ్లను హైడ్రా పరిరక్షిస్తుందని తెలిపారు. వర్షాలకు రోడ్లపై కూలిన చెట్లను సైతం హైడ్రా సిబ్బంది నిమిషాల్లో తొలగిస్తున్నారని గుర్తుచేశారు.కొందరు లేక్‌వ్యూ పేరుతో చెరువుల సమీపంలో ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు నిర్మించుకుని, వ్యర్థాలను, మురుగునీటిని నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారని, ఇలాంటి అక్రమార్కులకే హైడ్రా అంటే భయమని అన్నారు. వరదనీరు ప్రవహించాల్సిన నాలాలపై అక్రమంగా ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు నిర్మించారని, మూసీ పక్కన నివసించే వారి కష్టాలు ఆక్రమణలకు పాల్పడే నేతలకు తెలియవని చురకలంటించారు.మూసీ నదిని ప్రక్షాళన చేసి, నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్నదే తమ సంకల్పమని సీఎం పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. "గంగా, యమునా నదులను ప్రక్షాళన చేస్తే తప్పులేదు గానీ, మేం మూసీని బాగుచేస్తామంటే తప్పా మోదీ, యోగి చేస్తే గొప్ప, తెలంగాణ ప్రజలు తమ నగరాన్ని బాగుచేసుకుంటే తప్పా" అని ప్రశ్నించారు.మూసీ ఆక్రమణలు తొలగిస్తే రియల్ ఎస్టేట్ దెబ్బతింటుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలిలోని ఐఎంజీ భారత్ సంస్థ చేతిలో ఉన్న 400 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని తమ ప్రభుత్వం కోర్టులో పోరాడి కాపాడిందని తెలిపారు. ఈ భూమి పదేళ్లుగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ స్థలంలో కంపెనీలు వస్తే లక్షలాది ఉద్యోగాలు వచ్చేవని, కానీ నగరాభివృద్ధిని, ఉపాధి అవకాశాలను అడ్డుకున్నారని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa