తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన మరోసారి చర్చకు దారితీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. "బీజేపీలోకి ఎవరైనా రావాలంటే పిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారని" ఆయన తన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
కిషన్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం..
కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు కేవలం ఒక సాధారణ ప్రకటనగా కాకుండా.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు. అనేక మంది సినీ ప్రముఖులతో బీజేపీకి మంచి సంబంధాలున్నాయని, గతంలో విజయశాంతి, కోట శ్రీనివాసరావు, కృష్ణంరాజు, ఎస్. జానకి సుమన్, నరేష్ వంటి వాళ్ళు పార్టీలో పనిచేసి, కొందరు మంత్రులుగా కూడా అయ్యారని.. మరికొందరు పార్టీకి ప్రచారం చేశారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ గ్లామర్‌ను పార్టీకి జోడించుకోవాలనే బీజేపీ ఆకాంక్షను సూచిస్తున్నాయి.
అయితే.. చిరంజీవి ప్రస్తుత రాజకీయ వైఖరిని పరిశీలిస్తే.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యం కలిగిస్తాయి. గతంలో తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా విరామం తీసుకున్నానని చిరంజీవి అనేకసార్లు స్పష్టం చేశారు. గోవాలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో స్వయంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినప్పుడు కూడా.. ఆయన అలాంటి ఆలోచన లేదని తిరస్కరించారు. గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చినా.. బీజేపీ నుంచి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో అవకాశం ఉందన్న ప్రచారం జరిగినా.. చిరంజీవి వాటిని కొట్టిపడేశారు. తన రాజకీయ అరంగేట్రాన్ని సోదరుడు పవన్ కళ్యాణ్‌కు అప్పగించి.. పరోక్షంగా జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారు తప్ప, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న సంకేతాలు మాత్రం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ‘గాల్లో రాయి వేసే ప్రయత్నమే’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ రాజకీయ వ్యూహం..
కిషన్‌రెడ్డి కేవలం చిరంజీవి ప్రస్తావనకే పరిమితం కాకుండా, తెలంగాణ రాజకీయాలపై బీజేపీ వైఖరిని స్పష్టం చేశారు. కుటుంబ, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు. ‘మాకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే తప్ప, ఎవడో పనికిరాని వాడు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అంటే సమాధానం చెప్పాలా?" అని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ పోరును ఎత్తి చూపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో తదుపరి అధ్యక్షుడు ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేస్తూ.. బీజేపీలో మాత్రం అధ్యక్ష పదవికి పోటీ పడాలంటే రెండుసార్లు క్రియాశీల సభ్యుడు అయ్యి ఉండాలనే నియమం ఉందని, తమ పార్టీలో డైనింగ్ టేబుల్ నిర్ణయాలు ఉండవని తెలిపారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు కాబట్టి.. ఆయనకు ఈ నిబంధన వర్తించదని వివరించారు.
రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందనిజ.. తాము అధికారంలో లేనప్పటికీ, తెలంగాణకు కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. టెక్స్‌టైల్ ప్రాజెక్ట్, జహీరాబాద్‌లోని ఇండస్ట్రియల్ పార్క్, పసుపు బోర్డు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటివి బీజేపీ కృషి వల్లనే వచ్చాయని, కాంగ్రెస్ మంత్రులు తమ వల్లనే వచ్చాయని చెప్పుకుంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందని.. హైదరాబాద్ మెట్రో నెక్స్ట్ ఫేజ్‌కు కేంద్రం సహకారం అందిస్తుందని కూడా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి.. రాబోయే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తెలియజేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa