ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రైతుల శ్రేయస్సే తమ ప్రథమ లక్ష్యం అని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు నూతన ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయని.. రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయడానికి తమ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడదని ఆయన భరోసా ఇచ్చారు. న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కృషి ఉత్సవంలో ప్రధాని రెండు నూతన పథకాలు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు.
వ్యవసాయ రంగం కోసం రూ. 42 వేల కోట్లు..
దేశంలోని వ్యవసాయం, దాని అనుబంధ విభాగాల అభివృద్ధి కోసం రూ. 42,000 కోట్లకు పైగా విలువైన రెండు పథకాలు, ఇతర ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. రైతులకు సులభతర రుణాలు అందించడం, సాగు ఉత్పాదకత పెంపొందించడం, నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం ఈ పథకాల ముఖ్య ఉద్దేశాలు. ప్రారంభించిన కీలక పథకాల్లో ఒకటి ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన. ఈ పథకం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అమలు కానుంది. దీని ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, సాగుకు సంబంధించిన సామగ్రిని అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో పథకం పప్పు ధాన్యాల స్వయం-సమృద్ధి మిషన్. దేశాన్ని పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా నడిపించడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.
ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంపికైన ముఖ్యమైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం నాలుగు జిల్లాలు ఎంపిక చేశారు. వాటిలో నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలు. ఇక ఏపీ విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలు ఉన్నాయి. ఈ ఎంపిక ద్వారా ఈ జిల్లా కేంద్రాల్లోని రైతులు వ్యవసాయ ఆధునీకరణకు సంబంధించిన అన్ని ప్రయోజనాలు, సాంకేతిక సహకారాన్ని పొందగలుగుతారు.
పేద, రైతు సంక్షేమమే మా ధ్యేయం..
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు రైతుల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. వ్యవసాయ రంగం, రైతులు దేశాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, అందుకే NDA పాలనలో వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలియజేశారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా పేదలను, రైతులను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నామని.. ఈ రెండు నూతన కార్యక్రమాల ఆరంభం తమ సంకల్పానికి నిదర్శనమని ఆయన ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa