తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించాలనే లక్ష్యంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నవంబర్ నెలలో భారీ సంఖ్యలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారికి తక్షణమే కార్డులను జారీ చేస్తున్నారు.
ఈ పారదర్శక ప్రక్రియతో నిరుపేదలకు, అవసరమైన వారికి ఆహార భద్రత మరింత పటిష్టమవుతోంది. సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ‘డైనమిక్ కీ రిజిస్టర్’ (డీకేఆర్ – DKR) గణాంకాలు ఈ పెరుగుదలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నవంబర్ నెలలో కొత్తగా 4,917 రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు తమకు రేషన్ కార్డు వచ్చిందో రాలేదో తెలుసుకోవచ్చు. దీని కోసం ఈ వెబ్ సైట్ ను https://epds.telangana.gov.in/FoodSecurityAct/ సందర్శించవచ్చు.
గత నెలలో మొత్తం 11,47,560 కార్డులు ఉండగా.. తాజాగా వాటి సంఖ్య 11,52,477కు చేరుకుంది. అంటే మొత్తం కార్డుల సంఖ్య 0.43 శాతం మేర పెరిగింది. లబ్ధిదారుల యూనిట్ల సంఖ్య (కుటుంబ సభ్యుల సంఖ్య) గత నెలలో 34,66,221 ఉండగా... 14,376 యూనిట్లు పెరిగి మొత్తం సంఖ్య 34,80,597కు చేరింది. యూనిట్ల సంఖ్య పెరగడంతో బియ్యం కోటా కూడా పెరిగింది. గత నెలలో 22,007 టన్నులు ఉన్న బియ్యం కోటా.. 92 టన్నులు పెరిగి 22,099 టన్నులకు చేరింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు జిల్లాల పరిధిలో రేషన్ కార్డులు, యూనిట్లు, బియ్యం కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో.. 2,48,593 కార్డులు, 7,82,153 యూనిట్లు, 4,957.818 టన్నుల బియ్యం కోటా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పరిధిలో.. 3,67,781 కార్డులు, 10,71,265 యూనిట్లు, 6,798.994 టన్నుల బియ్యం కోటా.... నల్గొండ జిల్లా పరిధిలో.. 5,36,103 కార్డులు, 16,27,179 యూనిట్లు, 10,342.242 టన్నుల బియ్యం కోటా ఉన్నాయి.
లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వచ్చిన వెంటనే.. అధికారులు స్థానిక వీఆర్ఓ (VRO)ల ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి.. అర్హత నిర్ధారణ అయిన వెంటనే కార్డులు మంజూరు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కొత్త కార్డుల జారీ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఉచిత రేషన్ బియ్యం అందుబాటులోకి వచ్చి.. వారిపై నెలకొన్న ఆర్థిక భారం కొంతమేర తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య తెలంగాణలో ఆహార భద్రతా వ్యవస్థ బలోపేతానికి నిదర్శనం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa