పెట్రోల్ ధరలు పెరగడంతోపాటు ఇతరత్ర కారణాలు ఏమైనా సరే ఇటీవల మహిళలు ఎలక్ట్రిక్ కార్ల పట్ల మక్కువ చూపిస్తున్నారు. టాటా మోటార్స్ సంస్థ టియాగో ఎలక్ట్రిక్ కార్ల విక్రయ గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. చిన్న పట్టణాల్లో టియాగో ఈవీ అమ్మకాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ లో విడుదలైన టియాగో ఈవీ కారు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. తక్కువ ధరకు మెరుగైన ఫీచర్లతో ఈ కారు వస్తుండడం పట్ల కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే 15,000 యూనిట్లను ఈ సంస్థ విక్రయించింది.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు విక్రయించిన యూనిట్లలో మహిళలు సొంతం చేసుకున్నవి అధిక సంఖ్యలోనే ఉన్నాయి. సుమారు 24 శాతం కొనుగోలుదారులు మహిళలుగా ఉన్నారు. కానీ, కార్ల పరిశ్రమలో సగటు మహిళా కస్టమర్లు 12 శాతంగానే ఉండడం గమనించొచ్చు. అంటే సంప్రదాయ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపించే మహిళలు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు టియాగో ఈవీ కస్టమర్లలో 56 శాతం మంది వయసు 40 ఏళ్లలోపే ఉండడం గమనించొచ్చు.