దేశంలో ప్రేమ వ్యవహారాలు రోజురోజుకూ ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎవరు, ఎప్పుడు, ఎవరితో ప్రేమలో పడతారో అస్సలు ఊహించలేం. ఇది పాత మాట. కానీ ఇప్పుడు మాట్లాడే మాట ఏంటంటే ఏ జంట ఎప్పుడు విడిపోతుందో ఎవరూ చెప్పలేం. ఇక ప్రేమించుకుని.. కొన్ని రోజులు రిలేషన్‌లో ఉండి చివరికి విడిపోతున్న జంటలను ప్రస్తుతం చాలా మందిని చూస్తున్నాం. అయితే అది ఎవరో ఒకరి ప్రాణాల మీదికి రావడమే తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అప్పటివరకు బాగానే ఉన్న యువతీయువకులు.. ప్రేమను తెంచుకునే సమయంలో క్షణికావేశంలో ప్రాణాలు తీయడమో.. ఆత్మహత్యకు పాల్పడటమో జరుగుతోంది. దీంతో ఇద్దరి జీవితాల్లో తీరని శోకాన్ని మిగిల్చుకుంటున్నారు. తాజాగా ఓ 42 ఏళ్ల వ్యక్తి.. 22 ఏళ్ల యువతితో ఏడాదిపాటు ప్రేమలో ఉండి.. చివరికి ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతంలోని నోయిడాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ నోయిడాలోని సెక్టార్ 63 పోలీస్ స్టేషన్‌కు బుధవారం రాత్రి 10 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఛిజార్సి గ్రామంలో.. ఓ వ్యక్తి తన ప్రేయసిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న ప్రియుడు ప్రియురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ యువతి చనిపోగా.. ఆమె ప్రియుడు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నట్లు పోలీసులు చెప్పారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన నిషా అనే 22 ఏళ్ల యువతి.. ఢిల్లీలో నివసిస్తోంది. ఇక ధనంజయ్ కుమార్ అనే 42 ఏళ్ల వ్యక్తి.. ఛిజార్సి గ్రామంలో నివసిస్తున్నాడు. వీరిద్దరు గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే ధనంజయ్ కుమార్‌ను కలిసేందుకు అతని ఇంటికి ప్రియురాలు.. నిషా వెళ్లింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. చిన్న గొడవ కాస్తా పెద్దదిగా మారడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ధనంజయ్ కుమార్.. నిషాను గొంతు నులిమి చంపినట్లు చుట్టుపక్కల వారు చెప్పారని సెంట్రల్ నోయిడా అడిషనల్ డీసీపీ హిర్దేశ్ కార్తికేయ వెల్లడించారు.
క్షణికావేశంలో ప్రియురాలి గొంతు నులిమిన ధనంజయ్ కుమార్.. అనంతరం బ్లేడుతో తన గొంతు కోసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నిషా చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. అనంతరం తీవ్ర గాయాలైన ధనంజయ్ కుమార్‌కు అత్యవసర చికిత్సను అందించారు. ఇక వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ధనంజయ్ కుమార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.