తన స్నేహితుడు సోదరి పర్సులో నుంచి రూ.2000 చోరీ చేసిన ఓ మైనర్ బాలుడు.. వాటిని తిరిగి ఇచ్చేయమని అడిగితే దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సినిమాను తలపించిన ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు పద్మనాభనగర్‌లోని బృందావన్ లేఅవుట్లో ఉండే ప్రబుద్ద (19) బీబీసీ చదువుతోంది. ప్రబుద్ధ సోదరుడు, నిందితుడు(16) స్నేహితులు. దీంతో మైనర్ బాలుడు అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు.
ఇటీవల స్నేహితులందరూ కలిసి ఆడుకుంటుండగా మరో బాలుడి కళ్లద్దాలు పగిలిపోయాయి. వీటిని రిపేర్ చేయించడానికి డబ్బులు అవసరం పడింది. దీంతో ప్రబుద్ధ ఇంటికి వెళ్లిన మైనర్.. ఆమె పర్సులో నుంచి రూ.2,000 దొంగలించాడు. అతడు తన పర్సులో నగదు చోరీచేసిన విషయం గ్రహించిన ప్రబుద్ధ.. తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నిందితుడిని అడిగింది.
కానీ, మే 15న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పడు వెళ్లి క్షమించమని వేడుకున్నట్టు నటించి, ఆమె కాలు పట్టుకుని లాగేశాడు. దీంతో ఆమె కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా... ఇదే అవకాశంగా భావించిన నిందితుడు చేయి, గొంతు కోసి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు.. మూడు సూసైడ్ నోట్‌లు రాసిపెట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. బాత్‌రూమ్‌లో రక్తపు మరకలను కడగడానికి నీఠ్ల ట్యాంకు మొత్తం ఖాళీ చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో హత్య ఉదంతం బయపడింది. సమీపంలోని సీసీటీవీలో నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు రికార్డయ్యింది. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో బాలుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరచగా.. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్ హోమ్కు తరలించారు.
ప్రబుద్ధ తల్లి సౌమ్య మాట్లాడుతూ.. ‘ఎప్పటిలాగే తాను ఆ రోజు నా వర్క్ కోసం బయటకు వెళ్లాను.. నేను ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి తలుపు గడియ వేసి ఉంది.. పక్కింటివారి సాయంతో తలుపు తెరవగా.. బాత్‌రూమ్‌లో నా కుమార్తె అచేతనంగా పడి ఉంది.. సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.. రోజూ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి చేరుకున్నట్టు సమాచారం ఇచ్చేది.. కానీ ఆరోజు మెసేజ్ చేయలేదు’అని తెలిపింది. నిందితుడు తన కుమార్తె మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లాడని పేర్కొంది.
‘ఏ విద్యార్థికైనా అన్యాయం జరిగితే నా కుమార్తె పోరాటం చేసేది.. నా కూతురు హత్యకు గురైందని తెలిపే అనేక అంశాలు ఉన్నాయి. మేము చాలా అరుదుగా ఉపయోగించే వెనుక తలుపు తెరిచి ఉంది.. ఆ తలుపు ద్వారా వచ్చిన నిందితుడు నా కుమార్తెను చంపినట్లు నేను అనుమానించాను.’ అని ఆమె వాపోయింది.