ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైడెన్, కమలా హిందువులను విస్మరించారు.. నేను వస్తే మాత్రం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2024, 09:34 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్ ట్రంప్ ఒటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో ‘హిందూ’ కార్డు బయటకు తీశారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను ప్రస్తావించిన ఆయన.. తాను ఎన్నికల్లో గెలిస్తే భారత్‌, అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ మేరకు హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ (ట్విట్టర్)‌లో ట్రంప్ పోస్టు చేశారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, వైష్-ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌లు హిందువులను పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు.


అమెరికాతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్నా వారు చోద్యం చూస్తున్నారరని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే మాత్రం హిందువులకు రక్షణగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ‘బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను.. హిందువుల ఇళ్లు, దుకాణాలను అల్లరి మూకలు దోపిడీ చేశాయి... దీంతో ఆ దేశంలో తీవ్ర భయానక పరిస్థితులు తలెత్తాయి.. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలా ఎన్నడూ జరగలేదు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్‌లు విస్మరించారు.. ఇజ్రాయేల్‌ మొదలుకొని, ఉక్రెయిన్‌, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు ఎన్నో సంఘర్షణలు ఉన్నాయి..


మేం అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తీర్చిదిద్ది శాంతిని నెలకొల్పుతాం.. రాడికల్ లెఫ్ట్‌తో ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తాం.. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తాం.. మళ్లీ నా హయాంలో భారత్‌తో పాటు నా స్నేహితుడు, ప్రధాని నరేంద్ర మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటాం.. కమలా హ్యారిస్‌ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో మీ చిరు వ్యాపారాలను దెబ్బతీస్తుంది.. నేను గెలిస్తే పన్నులు, నిబంధనల్లో కొత విధించి, దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మిస్తా.. ఇంతకు మునుపు ఎన్నడూ లేనివిధంగా అమెరికాను అత్యంత శక్తిమంతగా, ఉత్తమంగా తీర్చిదిద్దుతా... మరోసారి దేశాన్ని ఉన్నతస్థాయిలో నిలబెడతా. దీపావళి పండగ చెడుపై విజయం సాధించేలా చేస్తుందని నేను నమ్ముతున్నాను’ అని ట్రంప్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.


కాగా, 2016 నుంచి 2020 వరకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్, అమెరికాల మధ్య సంబంధాల విషయంలో సానుకూలంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ట్రంప్‌, అమెరికాలోని టెక్సాస్‌లో ప్రధాని 2019లో ‘హౌడీ మోడీ’ పేరుతోనూ.. 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్’ పేరిట ఇరువురు నేతలు భారీ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలకు ఇరు దేశాల ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో భారతీయుల్లో ట్రంప్‌ పట్ల అభిమానం పెరిగింది. ఈ క్రమంలో అమెరికాలోని భారతీయులను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని ట్రంప్ వదులుకోవడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com