సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్. తెలుగులో క్రమానుగత పెట్టుబడి విధానం. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇలా సిప్ రూపంలో అంటే నెలవారీగా లేదా త్రైమాసిక ప్రాతిపదికన పెట్టుబడులు పెడుతుంటారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. నిర్ధిష్ట మొత్తం రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో పెడుతూ పోవాలి. ఇలా కొన్ని సంవత్సరాల్లో చేతికి మంచి రిటర్న్స్ వస్తాయి. ఏకకాలంలో (లంప్ సమ్) ఇన్వెస్ట్‌మెంట్లు కూడా ఉంటాయి. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి అంటే చాలా మందికి కుదరకపోవచ్చు. అందుకే సిప్ రూపంలో తోచినంత, సాధ్యమైనంత పెట్టుబడి పెడుతుంటారు. కనీసం రూ. 500 మొత్తంలో కూడా సిప్ చేయొచ్చు. దీనిని త్వరలో రూ. 250 కి తీసుకొచ్చేందుకు సెబీ కృషి చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే.. అప్పుడు చిన్న చిన్న కూలీ పని చేసుకునే వారు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొస్తారని చెప్పొచ్చు.
మ్యూచువల్ ఫండ్లలో సిప్ అనేది పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ప్రతి నెలా నిర్ణీత తేదీలోగా అమౌంట్ కట్ అవుతుంది. ఇక సిప్‌లో రూ. 1000, రూ. 3000, 5000 ఇలా ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్ ఆధారంగానే రిటర్న్స్ ఉంటాయి. మీకు లాంగ్ రన్ కోసమైతేనే, దీర్ఘకాలిక అవసరాల కోసమే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడం ఉత్తమం.
మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉండాలి. ఉదాహరణకు మీకు కొన్నేళ్లలో రూ. కోటి కావాలంటే.. ఎంత ఇన్వెస్ట్ చేస్తే.. ఎన్నేళ్లు పడుతుందో తెలుసుకోవాలి. ఇక్కడ సగటున మంచి ఫండ్స్ 15 శాతానికిపైగానే వార్షిక రిటర్న్స్ అందిస్తుంటాయి. మనం సగటున 14 శాతం అంచనా వేస్తే.. ప్రతి నెలా రూ. 1000, 3 వేల రూపాయలు, 5 వేల రూపాయలు ఇలా సిప్ చేస్తూ పోతే కోటి రూపాయలు వచ్చేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది చూద్దాం.
చాలా మంది ఇలా ఒక చక్కటి ఆర్థిక లక్ష్యంతోనే పొదుపు చేస్తుంటారు. దీనిని ఇన్వెస్ట్‌మెంట్ల రూపంలో మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌లో పెడతారు. నెలకు రూ. 1000 మొత్తంతో కోటి అయ్యేందుకు 35 ఏళ్లు పడుతుంది. ఇక్కడ మీ పెట్టుబడి మొత్తం ఇన్నేళ్లలో రూ. 4.20 లక్షలవుతుంది. చేతికి మొత్తం రూ. 1.12 కోట్ల వరకు వస్తుంది. ఇదే నెలకు రూ. 3 వేలతో అయితే రూ. 9.72 లక్షల పెట్టుబడిపై 27 ఏళ్లలోనే కోటి సంపాదించొచ్చు. 5 వేల సిప్‌తో అయితే మొత్తం 23 సంవత్సరాల్లో రూ. 13.80 లక్షల పెట్టుబడిపై కోటికిపైగా సంపాదించొచ్చు. ఇక్కడ 14 శాతం వార్షిక రిటర్న్స్ ఆధారంగా అని గుర్తుంచుకోవాలి. ఈ శాతాన్ని బట్టి రిటర్న్స్ ఉంటాయి.