కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఓ ఆలయంలోకి చొరబడిన దుండుగులు.. భక్తులపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టొరంటో సమీపంలో బ్రాంప్టన్‌లో హిందూ సభ ఆలయంలోకి పలువురు సిక్కు వేర్పాటువాద కార్యకర్తలు గేట్లపై నుంచి దూకి ప్రవేశించి, అక్కడ భక్తులపై దాడిచేయడం వీడియోలో రికార్డయ్యింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ భారీ భద్రతను ఏర్పాటుచేశారు.
దీనిపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎవర్నీ అరెస్ట్ చేయలేదని పీల్ రీజినల్ పోలీస్ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. అంతేకాదు, ఎటువంటి హింసకు చోటులేదని పేర్కొన్నారు. అధికార లిబరల్ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య మాట్లాడుతూ.. కెనడాలో హింస, తీవ్రవాదం ఎంత తీవ్రంగా మారిందో ఈ ఘటన తెలియజేస్తుందని అన్నారు.
‘‘కెనడాలోని మా హిందూ సమాజం భద్రత, వారి హక్కులను రక్షించడం, రాజకీయ నాయకులను జవాబుదారీగా ఉంచడం అవసరం.. రాజకీయ యంత్రాంగం, చట్టం అమలుచేసే కెనడా ఏజెన్సీల్లో తీవ్రవాద అంశాలు చొరబడ్డాయి’ అని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై బ్రాంప్టన్ మేయర్ స్పందిస్తూ.. హింసకు బాధ్యులైనవారికి చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మతస్వేచ్ఛ అనేది కెనడాకు అత్యంత బలమైన పునాది.. ప్రతి ఒక్కళ్లూ తమ ప్రార్థనా స్థలాలను సురక్షితంగా భావిస్తారు’ అని ట్వీట్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణను ఉల్లంఘించేలా హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడతామని... దోషులుగా తేలిన వారిని చట్టం ప్రకారం శిక్షిస్తామని పేర్కొన్నారు.
కెనడా ప్రతిపక్ష నేత పైర్రే పొయిలివ్రే ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఐక్యం చేసి, ఇటువంటి హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు. మరో ప్రతిపక్ష ఎంపీ కెవిన్ వ్యోగ్ సైతం తీవ్రవాదులకు కనడా సురక్షిత స్థావరంగా మారుతోందని, హిందువులు, యాదులను భద్రతను మన పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు అత్యంత దారుణంగా క్షీణించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది. భారత హైకమిషన్ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో కలకలం రేగుతోంది. దీనిపై భారత హైకమిషన్ స్పందిస్తూ.. ఇటువంటి ఘటనలు తమ రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కల్పిస్తాయని పేర్కొంది.