కార్తీక మాసంలో సర్వసత్కార్యములనూ చేయవచ్చును. కార్తీకమాసంలో_దీపారాధన అతి_ముఖ్యము. దీని వల్ల మిగుల ఫలము పొందవచ్చు. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమందుగాని ,విష్ణ్వాలయమందుగాని దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమందు అనగా సంధ్య చీకటి పడు సమయాన శివకేశవుల సన్నిధిన గాని, ప్రాకారమందుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠప్రాప్తి పొందుతారు. కార్తీక మాసంలో హరిహరాదుల సన్నిదిలో ఆవునేయ్యితోగాని, కొబ్బరి నూనెతోగాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని ఏది దొరకన్నప్పుడు ఆముదముతో గాని దీపమును వెలిగించాలి. దీపారధన ఏ నూనెతో చేసిన మిగుల పుణ్యాత్ములుగా, భక్తిపరులుగా అవ్వటమే కాక అష్టైశ్వర్యములూ కలిగి శివసన్నిదికి వెళ్తారు.
శత్రుజిత్కథ
పూర్వము పాంచాలదేశాన్ని పాలిస్తున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ణయాగాదులు చేసి విసుగుచెంది చివరికి గోదావరి తీరంలో నిష్ఠతో తపమాచరిస్తుండగా అక్కడికి పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి " పాంచాల రాజా! నీవెందుకింత తపమాచరిస్తున్నవు? నీ కోరిక యేమి?" అని ప్రశ్నించగా " ఋషిపుంగవా! నాకు అష్టైశ్వర్యలు,రాజ్యము, సంపదలు వున్న నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక, క్రుంగి కృశించి యీ తీర్థస్థలమున తపమాచరిస్తున్నాను" అని చెప్పాడు. అప్పుడు ముని పుంగవుడు " ఓయీ! కార్తీకమాసంలో శివదేవుని ప్రీతికొరకు దీపారాధన చేసినయెడల నీ కోరిక నెరవెరగలదు" అని చెప్పి వెళ్ళాడు.
వెంటనే ఆ రాజు తన దేశాని కిపోయి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెలరోజులూ దీపారధన చేసి, దానధర్మములతో నియమానుసరంగా వ్రతమ్ చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెడుతూ విడవకుండా నెలదినములు అలా చేసెను. తత్పుణ్యకార్యమువలన ఆ రాజు భార్య గర్బవతియై క్రమంగా నవమాసాలు నిండిన తరువాత ఒక శుభముహూర్తన కుమారున్ని కన్నది. రాజుకుటుంబీకులు ఆనందంతో తమ దేశమంతట పుత్రోత్సవమును చేయించి, బ్రాహ్మణులకు దానధర్మలు చేసి, ఆ బాలునికి " శత్రుజిత్తు" అని నామకరణం చేయించి అమిత గారాబంతో పెంచుతుండెవారు. కార్తీకమాస దీపారధన వల్ల పుత్రసంతానము కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు,దీపారధన చేయమని రాజు శాసించెను.
రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్థమానుడుఅవుతూ, సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలైనవి నెర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్థుల సహవాసము చేత, తల్లిదండ్రుల గారాబం చేత తన కంటికింపగు స్త్రీలను బలాత్కరిస్తూ, ఎదురించిన వారిని దండిస్తు తన కామవాంఛ తీర్చుకొంటుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని తలచి చూచి చూడనట్లు, వినీవిననట్లు వుందడిరి. శత్రుజిత్తు అ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పెవారిని నరుకుతానని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను చేస్తుండెను. అలా తిరుగుతూం డగా ఒకరోజు ఒక బ్రాహ్మణపడుచును చూసెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మంచి రూపవతి. ఆమె అందచందములను వర్ణించడం మన్మథునికైన శక్యముగాదు. అలాంటి స్త్రీ కంటపడగానే రాకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసేను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్దురాలై కులము, శీలము, సిగ్గు విడచి అతని చేయ్యిపట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపోయి భోగములను అనుభవించెను. ఇలా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతిదినము అర్థరాత్రివేళ ఒక అజ్ఞాతస్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొంటువుండేవారు. ఇలా కొంత కాలం అయ్యక ఎలాగో ఈ విషయం ఆమె భర్తకి తెలిసి, పసిగట్టి భార్యను, రాజకుమారున్ని ఒకేసారిగా చంపాలని నిర్ణయించి ఒక ఖడ్గన్ని వుంచుకుని సమయం కోసం వేచిచుస్తూన్నాడు. ఇట్లుండగా కార్తీకపౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరు శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకొని, యెవరికివారు రహస్యంమార్గంలో బయలుదెరారు. ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అయిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా వెళ్ళి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరూ కలుసుకొని గాడ ఆలింగనము చేసుకున్న సమయంలో "చీకటిగా వుంది , దీపముండిన బాగుండును కదా" అని రాకుమారుడనగా ఆమె తన పైటచెంగును చించి అక్కడున్న ఆముద ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వత వారిద్దరు మహానందంతో రతిక్రీడలు సలుపుటకు సిద్దమవుతుండగా అదే అదునుగా ఆమె భర్త తన వద్ద వున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యనూ, ఆ రాకుమారున్ని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యంకొద్ది ఆరోజు కార్తీకశుద్ద పౌర్ణమి సోమవారం అవుటచే ఆరోజు ముగ్గురూ చనిపోవుటవలన శివదూతలు ప్రేమికులిద్దరిని తీసుకుపోడానికి, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవడానికి అక్కడికి వచ్చరు. ఆ యమదూతలను చూసి బ్రాహ్మణుడు " ఓ దూతలారా! నన్ను తీసుకుపోవడానికి మీరెల వచ్చారు? కామాంధకారంతో కన్నుమిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారులకొరకు శివదూతలు విమానములో రావడమేమిటి? చిత్రంగా వుంది" అని ప్రశ్నించెను.