ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షీరాబ్ధి ద్వాదశి దామోదర ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి మహత్వము ప్రసాద్‌ భరధ్వాజ

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 12:03 PM

కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయితే ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి (చిలుక ద్వాదశి) అత్యంత పవిత్రమైంది. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా జరుపుకుంటారు.కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ధి ద్వాదశి అని పిలుస్తారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమథనం ప్రారంభించినది ఈ రోజే. అందుకే ఈ రోజుకి మధన ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు కనుక చిలుక ద్వాదశి అని అంటారు. ఈ రోజునే దామోదర ద్వాదశి, యోగీశ్వరద్వాదశి అని కూడా అంటారు. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తన యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అనే పేరు.*


ఉత్థాన ఏకాదశి(నిన్న) నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ధి ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. అయితే ఉసిరి కొమ్మ కాకుండా,  చిన్న కుండీల్లో ఉసిరి చెట్టును తెచ్చుకుని తులసి చెట్టు పక్కన వుంచి కలిపి పూజ చేసుకుంటే మంచిది. కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఉసిరి చెట్టు కొమ్మలను విరవడం, నరకడం వంటి పనులు చేయకూడదని శాస్త్రవచనం.


 క్షీరసాగర మధనములో జన్మించిన తేజోభరితమైన అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు. అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచరమును బట్టి శ్రీ మహాలక్ష్మికి, శ్రీమన్నారాయుణునికీ వివాహము చేసెదరు. బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీమహావిష్ణువు సాలగ్రామ రూపమును ధరించినది ఈ మహోత్కృష్టమైన రోజే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com