మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి చాలా ఆనందాన్ని ఇస్తుందని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నరేంద్రమోదీ కూటమికి ప్రజలు పెద్దఎత్తున్న ఓట్లు వేశారని అన్నారు.బీజేపీ మహారాష్ట్రలో సింగిల్‌గానే ఆధిక్యంలో ఉందని వివరించారు. మహారాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రజలు ఒక తీర్పు ఇచ్చారని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన అద్భుతమైన తీర్పు బీజేపీకి ఇచ్చారని అన్నారు.మహారాష్ట్రలో దాదాపు విజయం ఖరారు అయిందని చెప్పారు. బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేసిందని, 139 స్థానాలకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు
కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేసిందని అన్నారు. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు మాత్రమే పరిమితం అయిందని చెప్పారు. మోదీకి మరోసారి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. హర్యానా ఎన్నికల తర్వాత తమకు మహారాష్ట్రలో ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా అధికారం బీజేపీదే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని అన్నారు. ప్రజలు బీజేపీకి పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన మెజార్టీ తమ కూటమి పార్టీలకు ఇస్తున్నారని తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం మోదీ అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయడమని అన్నారు. దేశానికి మహారాష్ట్ర ఒక ఆర్థిక పట్టు అని చెప్పారు. మహారాష్ట్రలో మోదీ నాయకత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పడుతుందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
ఓట్ల లెక్కింపు మొదలుపెట్టినప్పటి నుంచి మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. ఉదయం 11 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం మహాయుతి కూటమి 220 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మహారాష్ట్ర ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించిన సంస్థల్లో కొన్ని గరిష్టంగా మహాయుతి కూటమికి 180 నుంచి 190 స్థానాలు గెలుస్తాయని చెప్పాయి. అయితే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 160కి పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. అదే సమయంలో జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఆ పార్టీ గెలిచిన విషయం తెలిసిందే.