రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్విట్టర్(ఎక్స్) లో ఓ పోస్ట్ చేశారు. తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గణనీయమైన సంఖ్యలో కాకినాడతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నివేదికలను ప్రాధాన్యం ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను కోరారు.
తమ ఏన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్‌వర్క్‌ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని అన్నారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో నేరస్థులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.