మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావటంతో.. కమలం పార్టీ ఇక మరింత విశ్వాసంతో జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు 2027లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే దేశంలో జమిలి ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చేసిన చిట్ చాట్‌లో చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు జరిగినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ముందస్తు ఎన్నికలు ఏవీ ఉండవంటూ నారా చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ - 2024 దిశగా ముందుకు వెళ్తామని చెప్పారు. అయితే జమిలి ఎన్నికలపై చంద్రబాబు రియాక్షన్ మీద వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. " 2027లోనే జమిలి అని బీజేపీ అంటోంది. జమిలి వచ్చినా 2029లోనే ఏపీ ఎన్నికలు అని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబూ.. నిజం కూడబలుక్కుని చెప్పండి" అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
అయితే 2027లో జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ ధీమాతో ఉంది. దేశంలో జమిలి ఎన్నికలు జరిగితే .. ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని.. టీడీపీ కూటమి సర్కారు ఉండేది మరో రెండున్నరేళ్లు మాత్రమే అంటూ వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమితో డీలా పడిన వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం జమిలి ఎన్నికలు వచ్చినా.. ఏపీలో మాత్రం 2029లోనే ఎన్నికలు అంటున్నారు. దీంతో అంబటి రాంబాబు.. చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటరిస్తూ ఇలా ట్వీట్ చేశారు. బీజేపీ జమిలి అంటుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం 2029లోనే ఎన్నికలు అంటున్నారని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.