ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?

national |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 07:57 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను దక్కించుకున్న ఎన్డీయే.. భారీ మెజారిటీ దిశగా సాగుతోంది. 150 స్థానాల్లో గెలిచిన మహాయుతి.. మరో 83 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 145 ఎమ్మెల్యేలు అవసరం కాగా.. ఎన్డీయే ఆ మార్క్‌ను దాటేసింది. ఊహించిన దాని కంటే భారీ విజయం సాధించడంతో కూటమి ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే ఫలితాల తర్వాత అక్కడ ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. రిజల్ట్స్ సంతోషాన్నిస్తున్నా.. గత పరిణామాలు మాత్రం బీజేపీని కలవరానికి గురి చేస్తున్నాయి. మరి ఆ పరిణామాలేంటి.. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంటుందా? అసలు దేని గురించి బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.. ప్రత్యేక కథనం మీ కోసం..
మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మరింత వేడెక్కుతున్నాయి. గెలిచిన సంతోషం కంటే వచ్చిన కొత్త తిప్పల్ని ఎలా పరిష్కరించడమా? అని ఆలోచనల్లో పడింది బీజేపీ. ముఖ్యమంత్రిగా ఎవర్ని నియమించాలనేది ఇప్పుడు కమలం పార్టీకి పెద్ద చిక్కుప్రశ్నగా తయారైంది. అటు ఏక్‌నాథ్ షిండేతో పాటు ఇటు అజిత్ పవార్ కూడా సీఎం రేసులో ఢీ అంటే ఢీ అంటుండటం, సొంతపార్టీలోని దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తగ్గేదేలే అంటుండటంతో బీజేపీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.


 


మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కూటమిలోని బీజేపీ 133 చోట్ల లీడింగ్‌లో ఉంది. ఆ పార్టీకి సీట్లు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమిలోని షిండే శివసేనతో పాటు అజిత్ పవార్‌తోనూ చేతులు కలపక తప్పదు. 2019లోనూ ఇలాగే క్లియర్ మెజారిటీ రాకపోవడంతో సర్కారును ఏర్పాటు చేయలేకపోయింది బీజేపీ. అందుకే షిండే, పవార్‌తో కలసి ముందుకెళ్లాలని డిసైడ్ అయింది. కానీ కొత్త సమస్యలు ఆ పార్టీని ఇబ్బందులు పెడుతున్నాయి.


అజయ్ పవార్‌ను సీఎంగా చూడాలని అనుకుంటున్నానని ఆయన సతీమణి సునేత్ర కామెంట్స్‌తో బీజేపీ మరింత ఇరకాటంలో పడింది. ముఖ్యమంత్రి పీఠంపై ఆయన కూర్చుంటే చూడాలని బారామతి ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. అటు ఏక్‌నాథ్ షిండే కూడా సీఎం కుర్చీపై తన మమకారాన్ని చూపిస్తున్నారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ (బీజేపీ)కే సీఎం సీటు ఇవ్వాలని రూల్ లేదు అంటున్నారు. తద్వారా తాను పోటీలో ఉన్నట్లు స్ట్రాంగ్ ఇండికేషన్స్ ఇస్తున్నారు.


కూటమిలోని బడా నేతలు సీఎం పీఠం గురించి చేస్తున్న వ్యాఖ్యలతో దీన్ని ఎలా పరిష్కరించాలా అని బీజేపీ పెద్దలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అంతగా సమయం కూడా లేకపోవడంతో వాళ్లు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగని హఠాత్తు నిర్ణయాలు తీసుకున్నా, సీఎం కుర్చీ బీజేపీ లేదా షిండే నేతృత్వంలోని శివసేనకు దక్కినా.. అటు అజిత్ పవార్ ఊరుకునేలా కనిపించడం లేదు. ఎప్పుడు ఎటు టర్న్ తీసుకుంటారో తెలియని అజిత్ పదవి దక్కలేదని కూటమిలో నుంచి బయటకు వచ్చేసే ప్రమాదం కూడా ఉంది. 2019 నుంచి ఇప్పటిదాకా అజిత్ మూడుసార్లు యూటర్న్ తీసుకున్నారు.


ప్రస్తుతం రాష్ట్ర సీఎంగా ఉన్న ఏక్‌నాథ్ షిండే మళ్లీ తానే ముఖ్యమంత్రి కావాలని పట్టుబడుతుండటం బీజేపీకి తలనొప్పిగా మారింది. గత రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న షిండే పాలనలో తన మార్క్ చూపించడంలో సక్సెస్ అయ్యారు. పథకాలను చక్కగా అమలు చేశారు. దీంతో తన హయాంలో ప్రభుత్వం సమర్థంగా నడిచింది కాబట్టి మళ్లీ తనకే ముఖ్యమంత్రి కుర్చీ దక్కాలని ఆయన బీజేపీతో బేరసారాలకు దిగుతున్నారని సమాచారం. 2022లో బీజేపీ కోసం శివసేనలో తిరుగుబాటు చేశారు షిండే. పలు విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అంత చేసిన తనను మళ్లీ సీఎం పీఠం ఎక్కించకపోతే షిండే ఊరుకునేలా లేరు. మరి.. ఈ సమస్యలను బీజేపీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com