తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులలో కొంతమంది టీటీడీకి విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. టీటీడీ నిర్వహించే పలు ట్రస్టులకు వ్యక్తులతో పాటుగా కంపెనీలు కూడా విరాళాలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే చెన్నైకు చెందిన ఓ భక్తుడు టీటీడీకి భారీ విరాళం ఇచ్చారు. చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు శనివారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు. అలాగే టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు మరో రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు. మొత్తంగా టీటీడీ ట్రస్టులకు రూ.2.02 కోట్లు విరాళంగా అందజేశారు. వ్యాసరాజ మఠాధిపతి విద్యాశ్రీశ తీర్థ స్వామిజీ సమక్షంలో విరాళం తాలూకు చెక్కులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేతికి అందజేశారు. టీటీడీ ట్రస్టులకు విరాళం ఇచ్చిన భక్తుడిని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రశంసించారు.
తిరుమలలో శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చన
మరోవైపు తిరుమలలో శనివారం శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చన నిర్వహించారు. ఆస్థాన మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీమన్నారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో సహస్ర గళార్చన నిర్వహించారు. శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మొదలైన కార్యక్రమం.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమంలో 1200 మంది స్తోత్ర పారాయణం చేశారు. ఈ శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చనలో భాగంగా 1036 శ్లోకాలను పారాయణం చేశారు. కేరళలో దీనిని సుప్రభాత పారాయణంగా పిలుస్తారు.
అయితే తెలుగు రాష్టాలలో తొలిసారిగా తిరుమలలో ఈ శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చన పారాయణం ఏర్పాటు చేశారు. ఇందుకోసం గత రెండేళ్లుగా శిక్షణ ఇస్తూ వచ్చారు. శనివారం ఆస్థాన మండపంలో నిర్వహించిన సహస్ర గళార్చన కార్యక్రమానికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. సామూహిక పారాయణం వలన మనుషులో మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం సాధారణ విషయం కాదన్న వెంకయ్య చౌదరి.. నిర్వాహకులను అభినందించారు.