తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీలో గంజాయి కలకలంరేపింది. హాస్టల్‌లో చీఫ్ వార్డెన్ తనిఖీ చేయగా ఓ గదిలో షాకింగ్ సీన్ కనిపించింది. యూనివర్సిటీలో యూజీ చదువుతున్న ఒడిశాకు చెందిన శతపథి అనే విద్యార్థి దగ్గర గంజాయి ప్యాకెట్లు దొరికినట్లు తెలుస్తోంది. అతడ్ని ప్రశ్నించగా.. తనకేం తెలియదని చెప్పడంతో వర్శిటీ ఉన్నతాధికారుల దృష్టికి చీఫ్ వార్డెన్ తీసుకెళ్లారు. అప్పుడు గంజాయి అంశం బయపడినట్లు సమాచారం. అతడు గంజాయి ప్యాకెట్లను తోటి విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై యూనివర్శిటీ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి స్పందించారు. వర్శిటీలో ప్రస్తుతం యూజీ పరీక్షలు జరుగుతున్నాయని.. కొందరు విద్యార్థులు గైర్హాజరు కాగా.. గమనించిన చీఫెన్ వార్డెన్ హాస్టల్‌లో తనిఖీలు చేశారన్నారు.
చీఫ్ వార్డెన్ తనిఖీ చేసే సమయంలో ఒడిశాకు చెందిన శతపథి అనే విద్యార్థి దగ్గర గంజాయి ప్యాకెట్లను గుర్తించినట్లు తెలిపారు. అతడి దగ్గర 20 గంజాయి ప్యాకెట్లలో 16 ప్యాకెట్ల గంజాయిని విజయవాడకు చెందిన ఆంజనేయులు అనే విద్యార్థికి విక్రయించినట్లు తెలిసిందన్నారు. మరో ముగ్గురు నాలుగు ప్యాకెట్లు సేవించినట్లు సమాచారం ఉందన్నారు. విద్యార్థులను ప్రశ్నిస్తున్నామని.. పోలీసులకు ఇంకా సమాచారం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. యాన్టీ డ్రగ్స్ కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశంపై ఆరా తీస్తున్నామని.. నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ గంజాయి ఆరోపణలు రావడంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లిడినట్లు వర్శిటీ వీసీ రమాశ్రీ తెలిపారు. ఒకవేళ డ్రగ్స్, గంజాయి సేవించినట్లు తేలితే విద్యార్థులను డిస్మిస్ చేస్తామంటున్నారు. యూనివర్శిటీలో ఆరు నెలలుగా విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నారనే ప్రచారం అవాస్తవం అన్నారు.
మరోవైపు తిరుపతిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయం కేసులో దంపతులు అరెస్టయ్యారు. ఆ జంట కుమారుడు ఇప్పటికే గంజాయి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నగరి మండలం ఓజీ కుప్పానికి చెందిన హరిప్రసాదరావు గతంలో గంజాయి కేసులో జైలుకెళ్లి ఈ మధ్యే విడుదలయ్యారు. కానీ మళ్లీ భార్య కుమారితో కలిసి నగరి, పుత్తూరు, నారాయణవనం, తమిళనాడు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారు.. పోలీసులకు సమాచారం రావడంతో నిఘా పెంచారు. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి తిరుపతికి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి రూ.200లకు యువకులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. వీరిని పాత తిరుచానూరు రోడ్డులో అరెస్ట్ చేసి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దంపతుల కుమారుడు ఇప్పటికే గంజాయి కేసులో అరెస్ట్ కాగా.. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే తాజాగా దంపతుల్ని అరెస్ట్ చేసిన గంజాయి కేసులో మరికొందర్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. మొత్తానికి తిరుపతిలో వరుసగా గంజాయి కేసులు కలకలంరేపుతున్నాయి.