మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన చోట మెజార్టీ సీట్లు బీజేపీ కూటమి గెలుచుకోవడం పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర చారిత్రక విజయం, ప్రధాని మోదీ సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తమయ్యాయన్నారు. ఈ గెలుపు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా చేసిందన్నారు. ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు... మోదీ ప్రజాసేవకు ఫలితం అన్నారు.ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిపై నడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. కులం, మతం పేరుతో భారత సమాజాన్ని విడదీయాలని ఇండియా కూటమి చూస్తోందని, కానీ ఎవరేమిటనేది ప్రజలకు తెలుసునన్నారు. నిన్నటి హర్యానా, నేటి మహారాష్ట్ర ఫలితాలు ఎవరేమిటనేది చెప్పాయన్నారు.మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు మాత్రమే తీర్పు ఇవ్వలేదని, 2019లోనూ అలాగే ఇచ్చారన్నారు. ఉద్ధవ్ ఠాక్రే పదవీ కాంక్ష, వెన్నుపోటుకు ప్రజలు ఈరోజు బుద్ధి చెప్పారన్నారు. ఆయన స్థానం ఏమిటో ఓటు రూపంలో చూపించారన్నారు. ఈ ఎన్నికల ద్వారా మరో విషయం తెలిసిందని, కాంగ్రెస్ తాను బలహీనపడటంతో పాటు తన కూటమి పార్టీలను కూడా బలహీనపరిచిందని తేలిపోయిందన్నారు.