ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఝార్ఖండ్‌లో ఆ సంప్రదాయాన్ని అధగమించి..అధికారం నిలబెట్టున్న హేమంత్ సోరేన్

national |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 10:44 PM

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను తలకిందులు చేస్తూ మళ్లీ విజయాన్ని అందుకున్నారు. ‘బంటీ ఔర్‌ బబ్లీ’గా పేరొందిన హేమంత్‌ - కల్పన జోడీ సూపర్‌ హిట్‌ కొట్టింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు కేరాఫ్‌గా నిలిచిన ఝార్ఖండ్‌లో.. మరోసారి స్పష్టమైన మెజార్టీ సాధించి సుస్థిర పాలన దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు, ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి హేమంత్ తెరదించారు.


అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే ఝార్ఖండ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మైనింగ్ కేటాయింపులకు సంబంధించిన మనీల్యాండరింగ్ ఆరోపణలతో సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టై జైలుకు వెళ్లడం సంచలనం రేపింది. ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన బీజేపీ.. హేమంత్‌ ప్రభుత్వం అవినీతిమయమైందని, బంగ్లాదేశ్‌ చొరబాటుదారులకు మద్దతిస్తోందని ఆరోపించింది. దాని వల్ల గిరిజనులకు చెందాల్సిన వనరులను వారు దోచుకుంటున్నారని ప్రచారం చేసింది. చంపయ్ సోరెన్‌ను సీఎం పదవి నుంచి తప్పించి, ఆదివాసీలను అవమానించారని బీజేపీ చేసిన ప్రచారాన్ని ఝార్ఖండ్ ప్రజలు నమ్మలేదు.


ప్రధాన భాగస్వామ్య పక్షం కాంగ్రెస్‌ నుంచి ఆశించిన మద్దతు లభించకపోయినా. సంక్షేమ పథకాలు, ఆదివాసీ సెంటిమెంటును నమ్ముకున్న సోరెన్ అనుకూల ఫలితాలు సాధించారు. హేమంత్‌ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆరోపించిన జేఏంఏం. ఆదివాసీల్లో సెంటిమెంట్‌ను రగిల్చి సఫలమైంది. ‘ముఖ్యమంత్రి మైయా సమ్మాన్‌ యోజన’ పేరుతో మహిళలకు నెలకు రూ.1,000 పథకాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని.. ఈ మొత్తాన్ని రూ.2,500లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ‘సర్నా’ను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానిస్తూ కేంద్రానికి లేఖ రాయడం కూడా కలిసొచ్చినట్లు తెలుస్తోంది.


ఈడీ కేసులో అరెస్టైన హేమంత్‌ సోరెన్.. తన వారసుడిగా చంపయ్‌ను నియమించారు. ఆయన జైలు నుంచి బయటకు రాగానే చంపయ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన.. బీజేపీలో చేరిపోయారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో హేమంత్‌ వదిన సీతా సోరెన్‌ కూడా కమలం పార్టీలో చేరడం జేఎంఎంకి ఎదురుదెబ్బగా మిగిలింది. ఆదివాసీ ప్రాంతాల్లో చంపయ్2కు ఉన్న ప్రజాదరణ ఆ వర్గం ఓట్లను చీలుస్తుందని, అది జేఏంఏం-కాంగ్రెస్‌ కూటమిపై ప్రభావం చూపిస్తుందని కాషాయ పార్టీ భావించినప్పటికీ ఫలితాలు వేరుగా వచ్చాయి.


హేమంత్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య కల్పనా సోరెన్‌ పార్టీలో కీలకంగా వ్యవహరించి.. బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. తర్వాత గాండేయ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో పోటీచేసి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత హేమంత్‌, కల్పన కలిసి దాదాపు 200 సభల్లో పాల్గొనడం విశేషం. ‘బంటీ ఔర్‌ బబ్లీ’గా పేరొందిన వీరిద్దరి జోడీ రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్షణగా నిలిచింది. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను జేఎంఎం 34 స్థానాల్లో, కాంగ్రెస్‌ 16 స్థానాల్లో.. ఆర్జేడీ 4, సీపీఎం 2 సీట్లలో గెలుపొందాయి. అధికారాన్ని ఆశించిన బీజేపీ కేవలం 21 సీట్లకే పరిమితమైంది. దాని మిత్రపక్షాలకు ఒక్క సీటే దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com