ఒకప్పుడు ఒకరే ముద్దు ఇద్దరే వద్దు.. కుటుంబనియంత్రణ పాటించాలని చెప్పిన ప్రభుత్వాలే మళ్లీ ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ప్రచారం చేస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లలో యువ జనాభా కంటే వృద్ధులే ఎక్కువవుతారు. ఇది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను తీవ్ర ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు చైనాయే ఉదాహరణ. జనాభా నియంత్రణకు ఆదేశం అమలు చేసిన కఠిన నిబంధనలే ఇప్పుడు శాపంగా మారాయి. ఇలాగే, ఓ సామాజిక వర్గం జనాభా నానాటి క్షీణించిపోవడంతో ఆందోళనకు గురవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మైనార్టీల జాబితాలోకి చేరిపోతామని కలవరపడుతోంది. ఈ క్రమంలో పిల్లలను కనాలని తమ సామాజికవర్గానికి చెందిన జంటలను కోరుతుంది. అంతేకాదు, ప్రోత్సాహకాలు కూడా అందజేస్తామని ప్రకటించింది. ముగ్గుర్ని కంటే రూ.50 వేలు.. నలుగుర్ని కంటే రూ.లక్ష ఇస్తామని చెప్పింది.
ఇండియా స్కాట్లాండ్‌గా గుర్తింపు పొందిన కర్ణాటకలోని కొడగు జిల్లాలో కొడవ సామాజిక వర్గాలు ప్రత్యేక చరిత్ర ఉంది. ప్రస్తుతం ఆ వర్గం జనాభా రోజు రోజుకూ తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అల్ప సంఖ్యాకుల జాబితాలోకి చేరిపోతామన్న భయం వారిని పట్టుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ జిల్లాలోని పొన్నంపేట తాలూకా టి.శెట్టిగేరిలోని కొడవ సముదాయం ఓ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. ముగ్గురు పిల్లల్ని కంటే రూ.50 వేలు, నలుగుర్ని కంటే రూ.లక్ష బహుమతి ఇస్తామని తెలిపింది.
అయితే, ఈ నగదు బహుమతి మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, చివరి బిడ్డకు 18 ఏళ్లు నిండిన తర్వాత అందుకునేలా ఏర్పాట్లు చేస్తామని ఆ సముదాయం ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే తమ ప్రాంతంలోని ముగ్గురు, నలుగురు పిల్లల్ని కన్న తల్లిదండ్రులను గుర్తించి ఇచ్చిన మాటకు అనుగుణంగా నగదు డిపాజిట్ చేసి, బాండ్లను వారికి అందజేస్తున్నారు. కొందరైతే ఒక్క బిడ్డ చాలనే ధీమాతో ఉన్నారని ఇది సరైంది కాదని చెబుతున్నారు. భవిష్యత్తులో జనాభా తగ్గే అవకాశం ఉంది కాబట్టి మరింత మంది పిల్లలు కనేలా ప్రోత్సహించేందుకే ఈ ఆఫర్ ఇస్తున్నట్లు చెప్పారు.