నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోందని.. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో తీవ్రవాయుగుండం కదులుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ వాయుగుండం ప్రస్తుతానికి ట్రింకోమలీకి 270 కి.మీ, నాగపట్నానానికి 300 కి.మీ, పుదుచ్చేరికి 340 కి.మీ, చెన్నైకి 380 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. రాగల 6 గంటల్లో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందన్నారు. శనివారం మధ్యాహ్నం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందన్నారు.
ఈ ప్రభావంతో ఇవాళ, శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రోణంకి కూర్మనాథ్. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏర్పడటంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ వర్షాలు పడితే చేతికి వచ్చిన వరి పంట తడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.20వేల వరకు ఖర్చు చేశామని.. ఒకవేళ వాన పడితే పెట్టుబడి కూడా రాదంటున్నారు.. కొందరు రైతులు ముందస్తు జాగ్రత్తగా కోత కోసి ధాన్యాన్ని ఇళ్లకు చేర్చుకుంటున్నారు.
మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుండడంతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో చలి తీవ్రత కనిపిస్తోంది. డిసెంబర్ నెలలో చలి ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చలి దెబ్బకు వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు ఇబ్బందులు పడుతున్నారు.. వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.