అనంతపురం జిల్లాలో భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. చనిపోతున్నానంటూ ఓ యువకుడు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. అతడి కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. బెళుగుప్ప మండలం దుద్దేకుంటకు చెందిన ఆవుల అనిల్‌కు.. విడపనకల్లు మండలం హావళిగికి చెందిన గీతతో ఏడాది క్రితం వివాహమైంది. అనిల్ కియా మోటార్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం తర్వాత భార్య గీత భర్తతో గొడవకు దిగేది. గతంలో పెద్దల దగ్గర పంచాయితీ చేసి సర్ధి చెప్పారు.. అయినా సరే గొడవలు కొనసాగాయి.
ఇటీవల భర్తతో గీత మరోసారి గొడవకు దిగింది. దీంతో అనిల్ ఈ నెల 27న గంగవరం వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరి వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు.. అదే రోజు సాయంత్రం తన భార్య తనతో సరిగా ఉండటం లేదంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. తాను పురుగు మందు తాగి చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకోగా.. కొద్దిసేపటికి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ అతడి ఆచూకీ తెలియరాలేదు.. అనిల్ సోదరుడు రాము ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అనిల్ కోసం గాలిస్తున్నారు.
అనిల్ సెల్ఫీ వీడియోలో.. 'అమ్మానాన్న నన్ను క్షమించండి.. నా భార్య నన్ను బెదిరిస్తోంది.. ఆ వేధింపులు భరించలేకపోతున్నా. అత్తామామలు మంచివాళ్లే.. నా భార్య వారు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తోంది. తాను చనిపోతానంటూ నన్ను బెదిరిస్తుంది. ఈ బాధ భరించలేక నేనే చనిపోతున్నా. అన్నయ్య.. అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో’ అంటూ వీడియో రికార్డు చేశాడు. అనిల్ ఎక్కడున్నాడు అనేది క్లారిటీ లేదు.. అనిల్ మొబైల్ టవర్ ఆధారంగా ఎక్కడున్నాడో గుర్తించే పనిలో ఉన్నారు.
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ వ్యక్తి భార్య తిట్టిందనే కోపంతో ప్రాణాలు తీసుకున్నాడు. చింతపల్లి మండలం లోతుగెడ్డ కూడలికి చెందిన చెందిన జంపా ప్రసాద్‌కు గురంధరపాలేనికి చెందిన ధనలక్ష్మితో వివాహం అయ్యింది.. వీరికి వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రసాద్ అనకాపల్లిలోని ఓ షాపులో పనిచేస్తూ ఏడాదిగా మద్యానికి బానిసయ్యాడు. రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి రావడం.. వచ్చాక ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడుతుండటంతో భార్య కొంతకాాలంగా గొడవకు దిగింది. ప్రసాద్ బుధవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు.. దీంతో భార్య మరోసారి గొడవపడింది. ఆ కోపంతో ప్రసాద్ కోపంగా బైకుపై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం ఓ తోటలో అతడి మృతదేహం చెట్టుకు వేలాడటం గమనించిన స్థానికులు.. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ప్రసాద్ ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.