తాము అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నామని, ఏకంగా 47 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మరి ఇప్పుడు ఆ బియ్యం ఏమైంది? ఆ బియ్యం అక్రమ రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రెండ్రోజులు కాకినాడలో హడావిడి, హంగామా తర్వాత బియ్యం అక్రమ రవాణా నిల్చిపోయిందా? అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ.... ఇటీవలే సముద్రంలో బియ్యంతో కూడిన భారీ నౌక పట్టుబడిందని అధికారులు చెప్పారు.
అసలు ఏం జరుగుతోంది?. నిజానికి కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. మా ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఏటా రూ.1800 కోట్ల వ్యయంతో సార్టెక్స్ బియ్యం సరఫరా చేశాం. కూటమి ప్రభుత్వం దానికి కూడా మంగళం పాడింది. ఇప్పుడు ఏ మాత్రం నాణ్యత లేని బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇంకా మా హయాంలో రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారతో పాటు, గోధుమపిండి, రాగిపిండి పంపిణీ చేశాం. ఇప్పుడు వాటిని కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గోధుమపిండి, రాగిపిండి తిరిగి సరఫరా చేయాలని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కోరారు.