చంద్రబాబు అధిక ధరలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల 25 ఏళ్లలో దాదాపు రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని, అదే తమ ప్రభుత్వం రూ.2.49కే చేసుకున్న ఒప్పందం వల్ల అదే 25 ఏళ్లలో ఏకంగా రూ.1.10 లక్షల కోట్లు ఆదా అవుతాయని మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ పక్కాగా ఆధారాలు, గణాంకాలతో సహా వివరించినా, ఎల్లో మీడియా మళ్లీ అవే అబద్ధాలు రాస్తోందని వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. విశాఖపట్నం క్యాంప్ ఆఫీస్‌లో వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాసే కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు పూర్తిగా ప్రజల దృష్టి మళ్లించేందుకు మా అధినేత వైయస్ జగన్ వ్యక్తిత్వ హననం చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
అందుకే నిత్యం బురద చల్లుతూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. గత 15 ఏళ్లుగా చేస్తున్న ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప, ఎక్కడా ఆధారాలు చూపించే ధైర్యం చేయడం లేదు. టీడీపీ గెజిట్ పేపర్లుగా ఉండి వైయస్ జగన్.. కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్ఆర్సీపీ స్థాపించిన నాటి నుంచి ఈ పత్రికలన్నీ ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయి. తాజాగా సోలార్ పవర్ కాంట్రాక్టులో అదానీతో ఒప్పందం చేసుకున్నారని, అందుకుగాను లంచం తీసుకున్నారంటూ తప్పుడు ప్రకటనలు చేశారు. సోలార్ పవర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందపై సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌లు సంతకాలు చేశాయి. పూర్తి పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంలో ఎక్కడా థర్డ్ పార్టీ లేదు. దళారులు అంత కంటే లేరు. అదే చంద్రబాబు హయాంలో విండ్ పవర్‌కు సంబంధించి పీపీఏలు చూస్తే 2014– 19 మధ్య 3500 మెగావాట్లకు 133 ఒప్పందాలను సగటు యూనిట్ ధర రూ.4.83 చొప్పున చేసుకున్నారు. అలాగే సోలార్ పవర్ పీపీఏలు చూస్తూ 2014–19 మధ్య 35 ఒప్పందాలు చేసుకుంటే వాటిని సగటు యూనిట్ ప్రైజ్ రూ.5. ఇప్పుడున్న ధరలు చూస్తే దేశవ్యాప్తంగా ఎక్కడా రూ. 2.70కు తక్కువ దొరకడం లేదు. మన రాష్ట్రానికి కూడా కావాలంటే రూ.3.10కి తక్కువ దొరికే పరిస్థితి లేదు. పైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 25 ఏళ్లపాటు ఇంటర్ స్టేట్ ట్రాన్సమిషన్ ఛార్జీల మినహాయింపుతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి 25 ఏళ్లలో రూ. 1.10 లక్షల కోట్లు ఆదా చేయడం ద్వారా, అంత సంపద సృష్టించినట్లు అయింది అని వివరించారు.