రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యంను కొనుగోలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కమీషన్ల కక్కుర్తితో ధాన్యం కొనుగోళ్ళను పూర్తిగా దళారీల పాల్జేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తుండటంతో ధాన్యం పండించిన రైతుల గోడు అరణ్యరోదనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దీనంగా మారింది.
గన్నీ బ్యాగులు, హామాలీలు, రవాణా వాహనాలు అన్నీ కూడా దళారీల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. మేం అమలు చేసిన ఈ–క్రాప్ విధానాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. పంట నష్టానికి ఇచ్చే బీమా కూడా ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోళ్లు పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల అధికారులు దేన్నీ పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడికక్కడ కల్లాల్లో ధాన్యం గుట్టలుగా కనిపిస్తోంది. గిట్టుబాటు ధరకు ధాన్యం అమ్ముకోలేక రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో పంట వేసుకోవడానికి ముందే తమకు రైతు భరోసా డబ్బు జమ అయ్యేదని, వర్షాల వల్ల పంట దెబ్బ తింటే, ఆ సీజన్ ముగియక ముందే పరిహారం లభించేందని రైతులు గుర్తు చేస్తున్నారు అని తెలియజేసారు.