ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ విశేష ఉత్సవాలివే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 10:04 PM

డిసెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలని టీటీడీ విడుదల చేసింది. ⁠1న శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం అవుతుంది. ⁠11న సర్వ ఏకాదశి, ⁠12న చక్రతీర్థ ముక్కోటి, ⁠13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర ఉంది. ఈ నెల ⁠14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, ⁠15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తారు. ⁠16న ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.. అలాగే డిసెంబర్ 26న సర్వ ఏకాదశి, ⁠29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, ⁠30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి.


తిరుచానూరు బ్రహ్మోత్సవాలు


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో శ్యామల రావు, జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సీవీ అండ్ ఎస్వో శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.


రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు మంత్రి ఆనం. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరిలో ఒకరిగా అమ్మవారి దర్శనం చేసుకునే తాను, పట్టు వస్త్రాలు సమర్పించే ఘటనలను టీవీల్లో చూడడం, పత్రికల్లో చదవడమో చూశానన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తల్లిదండ్రుల పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని.. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడికి రుణపడి ఉంటానన్నారు.


తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకున్నానని.. అదే రోజున శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మెరుగైన మార్పులు తీసువచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల కోసం టీటీడీ అన్ని వ‌స‌తులు క‌ల్పించింద‌న్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.


తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు మురళి కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్న‌శేష‌వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు. మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరులతల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి ద‌ర్శ‌నం వ‌ల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన గురువారం ఉద‌యం చిన్నశేష వాహనసేవలో వివిధ రాష్ట్ర‌ల‌ నుండి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 12 కళాబృందాలు, 298 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవశింప చేశారు.


తమిళనాడు దిండిగల్ కు చెందిన 25 మంది కళాకారులు దిండిగల్ డ్రమ్స్ ను లయ బద్ధంగా వాయిస్తూ భక్తులను పరవశింప చేశారు. చెన్నైకి చెందిన సత్యప్రియ బృందం భరతనాట్యం, కేరళకు చెందిన 30 మంది మహిళ కళాకారులు మోహిని అట్టం నృత్యం ప్రదర్శించారు. హైదరాబాద్ కు చెందిన 22 మంది మహిళలు వివిధ దేవతామూర్తుల వేషధారణ, భరతనాట్యం భక్తులను ఆకర్షించింది. అదే విధంగా విశాఖపట్నంకు చెందిన 32 మంది చిన్నారులు, యువతులు మహిషాసుర మర్దిని నృత్య రూపకం, అమలాపురం శ్రీ అయోధ్య సీతారామ కోలాట భజన మండలికి చెందిన 28 మంది మహిళలు కోలాటం, హైదరాబాద్ రఘు రమ్య అకాడమీకి చెందిన 28 మంది కళాకారుల శ్రీనివాస కళ్యాణం, కేరళకు చెందిన కళాకారుల నవదుర్గల వేషధారణ భక్తులను పరవశింపజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com